వేసవి కదా అని స్విమ్మింగ్ పూల్‌కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Swimming Pool Precautions Advised by LV Prasad Eye Institute
  • స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు గాగుల్స్ ఉపయోగించాలని వైద్యుల సూచన
  • దగ్గు, జలుపు వంటి లక్షణాలు ఉంటే స్విమ్మింగ్ పూల్‌కు దూరంగా ఉండాలి
  • కళ్లకు దురదగా అనిపిస్తే ఐడ్రాప్స్ వాడాలని సూచన
వేసవి సెలవులు వస్తే చాలు పిల్లలు ఎంతో సరదాగా గడుపుతారు. ఎండను కూడా లెక్క చేయకుండా స్నేహితులు ఆరుబయట ఆడుకుంటారు. గ్రామాల్లో వేసవి కాలంలో పిల్లలు ఈత కోసం బావుల వద్దకు వెళతారు. హైదరాబాద్ వంటి నగరాల్లో స్విమ్మింగ్ పూల్స్ కళకళలాడుతాయి. స్విమ్మింగ్ పూల్స్‌కు చాలా డిమాండ్ ఉండటంతో నగరంలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి.

పిల్లల ఉత్సాహం చూసి పెద్దలు కూడా వారిని స్విమ్మింగ్ పూల్స్‌కు పంపిస్తుంటారు. అయితే పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే కళ్లకు ఇన్‌ఫెక్షన్ కలిగించే 'అకాంతమీబా' అనే సూక్ష్మజీవికి స్విమ్మింగ్ పూల్స్‌ ఆవాసాలుగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

కార్నియల్ ఇన్‌ఫెక్షన్ చికిత్స పొందిన వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది కలుషితమైన నీటి ద్వారానే ఈ వ్యాధిబారిన పడ్డారని పరిశోధనలో గుర్తించారు. కాంటాక్ట్ లెన్స్‌లతో ఈతకొట్టే వారికి ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గాగుల్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇవి సౌకర్యం కోసం మాత్రమే కాదని, ఇన్‌ఫెక్షన్ బారి నుంచి కాపాడుతాయని చెబుతున్నారు.

అలాగే, ఇన్‌ఫెక్షన్ తగ్గించడానికి స్విమ్మింగ్ పూల్ యజమానులు క్లోరిన్ ఉపయోగిస్తారని, ఇది కంటిలోని సహజ రక్షణ పొర అయిన కన్నీటి పొరను బలహీనపరుస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన అనంతరం వెంటనే శుభ్రమైన నీటితో కళ్లు కడుక్కోవడం ద్వారా రసాయనాలు, వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అధిక క్లోరిన్ కారణంగా కంటి ఇన్‌ఫెక్షన్, కండ్ల కలక, తీవ్రమైన కళ్ల మంట, దృష్టి మసకబారడం వంటి వ్యాధులు దరిచేరవచ్చని చెబుతున్నారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ వేస్తారు కనుక అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

దగ్గు, జలుబు, ముక్కుకారడం, కంటి నుంచి చీము కారడం వంటి లక్షణాలు ఉన్న వారిని ఈతకు తీసుకువెళ్లవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్‌లో ఎక్కువ సేపు ఉంటే పిల్లలకు కళ్లు దురద పెట్టే అవకాశం ఉందని, అలాంటి సందర్భాలలో కంటి చుక్కల మందును వేసుకోవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు.

వేసవి కాలంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

- పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టవద్దు.
- స్విమ్మింగ్ పూల్‌లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా సీపీఆర్ నేర్చుకుని ఉండాలి.
- జలుబు, ముక్కు కారడం, జ్వరం ఉన్నవారు పూల్‌కు దూరంగా ఉండాలి.
- పూల్ కండ్లకలక, అధిక క్లోరినేషన్‌ను నివారణకు గాగుల్స్ ఉపయోగించడం తప్పనిసరి.
- ఈత కొట్టేటప్పుడు కాంటాక్ట్ లెన్సులు ధరించవద్దు.
- కళ్లు దురదగా ఉంటే ఐ డ్రాప్స్ వాడాలి.
- స్విమ్మింగ్ పూల్‌లో నీరు స్వచ్ఛంగా ఉండాలి. పూల్ అడుగుభాగం కనిపించేలా ఉండాలి.
- స్విమ్మింగ్ పూల్ సిబ్బందికి సీపీఆర్ వంటి ప్రాథమిక ప్రాణ రక్షణ నైపుణ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

స్విమ్మింగ్ పూల్ యజమానులకు సూచన:

- స్విమ్మింగ్ పూల్ యొక్క పీహెచ్ స్థాయి 7.2 నుండి 7.8 మధ్య ఉండాలి.
- క్లోరిన్ 0.2 మరియు 0.5 ఎంజీ/లీటర్ల మధ్య ఉండాలి.
- వేసవి కాలంలో ప్రతి 2 నుండి 3 గంటలకు పూల్స్‌లో పీహెచ్ స్థాయి మరియు క్లోరిన్‌ను తప్పనిసరిగా పరీక్షించాలి.
Go Back to Shorts
LV Prasad Eye Institute
Swimming pool safety
Summer swimming
Eye infections
Swimming pool chlorine

More Telugu News