ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్

Jagan slams AP Govt over fuel shortage
  • ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమమేనన్న జగన్
  • కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ
  • ధరల పెంపును ఆశించి డీలర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శ
  • ఈ సంక్షోభంతో రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య
  • ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సహజంగా ఏర్పడిన సంక్షోభం కాదని, కూటమి నాయకులు, పెట్రోల్ బంకుల డీలర్లు కుమ్మక్కై సృష్టించిన కృత్రిమ కొరత అని సంచలన ఆరోపణలు చేశారు. సమస్య వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకుని దోచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ అదే జరుగుతోందని విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయనే అంచనాలతో డీలర్లు ఉద్దేశపూర్వకంగా నిల్వలను బ్లాక్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ దోపిడీ పర్వంలో వారితో కూటమి నాయకులు జతకట్టి, లబ్ధి పొందేందుకు సిద్ధమయ్యారని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎలాంటి కొరత లేనప్పుడు, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవని, ఇది పూర్తిగా మానవ సృష్ట సంక్షోభమని జగన్ స్పష్టం చేశారు.

ఈ కృత్రిమ కొరత కారణంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రబీ పంటల కోతల సమయం కావడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. పంట నూర్పిడి యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం కాగా, సరఫరా నిలిచిపోవడంతో యంత్రాలు పొలాల్లోనే ఆగిపోతున్నాయని తెలిపారు. దీనివల్ల రైతులు కోలుకోలేని నష్టాలను చవిచూస్తున్నారని వివరించారు. అలాగే, ఆక్వా రంగంలో ఏరియేటర్లు నడిపేందుకు డీజిల్ అందక రొయ్యలు, చేపల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ఈ తీవ్రమైన సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం ఒక సమగ్ర సమీక్ష కూడా నిర్వహించకుండా, కేవలం మీడియాకు లీకులిస్తూ కాలయాపన చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. సరఫరా తగ్గుతుందనే భయంతో ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని కుంటిసాకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో విత్తనాలు, ఎరువులు, యూరియా నుంచి వంట గ్యాస్ వరకు ఇలాగే కృత్రిమ కొరత సృష్టించి చంద్రబాబు లబ్ధి పొందారని, ఇప్పుడు ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ను చేర్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరిస్థితిని చక్కదిద్దాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, తగిన గుణపాఠం చెబుతారని జగన్ హెచ్చరించారు.
Go Back to Shorts
Jagan
Fuel Shortage
Chandrababu
YSRCP
TDP

More Telugu News