రక్తంలో చక్కెర స్థాయులను తెలుసుకోవడానికి చాలామంది హెచ్‌బిఏ1సి (HbA1c) పరీక్షపైనే ఆధారపడతారు. అయితే, హెచ్‌బిఏ1సి నార్మల్‌గా ఉండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS) ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటి? ఈ వైరుధ్యం చాలామందిలో కనిపిస్తుందని, దీనిని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హెచ్‌బిఏ1సి 4.0 ఉన్నా, ఫాస్టింగ్ షుగర్ 121గా ఉండటం వంటి సందర్భాలు ఆందోళన కలిగించేవే.

గత 2-3 నెలల సగటు చక్కెర స్థాయిని హెచ్‌బిఏ1సి సూచిస్తే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మాత్రం 8-10 గంటల ఉపవాసం తర్వాత కేవలం ఆ ఒక్క సమయానికి ఉన్న గ్లూకోజ్ స్థాయిని మాత్రమే చూపుతుంది. ఈ రెండు పరీక్షల మధ్య తేడా ఉందంటే శరీరంలో జీవక్రియల అసమతుల్యతకు అది తొలి సంకేతం కావచ్చు.

వైద్యులు ఏమంటున్నారు?
మణిపాల్ హాస్పిటల్, సర్జాపూర్‌కు చెందిన ఎండోక్రినాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ గురుసంగప్ప ఎస్. ముదగల్ ప్రకారం, ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు. ఈ దశలో కాలేయం రాత్రిపూట ఎక్కువ గ్లూకోజ్‌ను విడుదల చేయడం వల్ల, ఉదయం పరగడుపున చేసే పరీక్షలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా, రక్తహీనత (Anaemia), కిడ్నీ వ్యాధులు, ఇటీవలి రక్తస్రావం వంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా హెచ్‌బిఏ1సి వాస్తవ స్థాయి కంటే తక్కువగా కనిపించవచ్చని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ఫాస్టింగ్ షుగర్ 100 mg/dL లోపు ఉండాలి. 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే ప్రీడయాబెటిస్‌గా, 126 mg/dL దాటితే డయాబెటిస్‌గా పరిగణిస్తారు. హెచ్‌బిఏ1సి నార్మల్‌గా ఉన్నప్పటికీ, ఫాస్టింగ్ షుగర్ 120 mg/dL దాటితే, వెంటనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు రిపోర్టులలో తేడా ఉంటే వైద్యులను సంప్రదించి, అవసరమైన మరిన్ని పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.