భూమిపై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయడం సాధారణం. కానీ భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటూ ఓటేస్తే? అచ్చం ఇదే చేశారు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌. అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఆయన అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అనిల్‌ మీనన్‌ మంగళవారం ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో అంతరిక్ష కేంద్రంలోని తన వ్యక్తిగత గదిలో ఉంటూ ఓటు వేసే ప్రక్రియను వివరించారు. ఆ గదే ఆరోజు ఆయనకు పోలింగ్‌ కేంద్రంగా మారింది. టెక్సాస్‌ రాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేసినట్లు తెలిపారు.

అంతరిక్ష కేంద్రంలో ఉన్న ముగ్గురు అమెరికా వ్యోమగాములు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని మీనన్‌ వెల్లడించారు. ఇందుకోసం సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ను ఉపయోగించారు. ల్యాప్‌టాప్‌లో ఓటు నమోదు చేసిన తర్వాత, నాసా సురక్షిత సమాచార వ్యవస్థ ద్వారా భూమిపై ఉన్న ఎన్నికల అధికారులకు పంపించారు. 

అంతరిక్షం నుంచి ఓటు వేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ వంటి పరికరాలతోనే ఇబ్బందులు పడుతుంటే.. అంతరిక్షంలో వ్యోమగాములు సులభంగా ఓటు వేయడం ఆసక్తికరంగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరికొందరు దీన్ని అత్యంత ప్రత్యేకమైన ఓటు అనుభవంగా అభివర్ణించారు. 

వ్యోమగాములు అంతరిక్షం నుంచి ఓటు వేయడం ఇదే తొలిసారి కాదు. టెక్సాస్‌ శాసనసభ 1997లో ఇందుకు అనుమతిస్తూ చట్టం తీసుకొచ్చింది. అదే ఏడాది నాసా వ్యోమగామి డేవిడ్‌ వోల్ఫ్‌ మీర్‌ అంతరిక్ష కేంద్రంలో ఉంటూ తొలిసారిగా అంతరిక్షం నుంచి ఓటు వేశారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్రల్లో ఉండే వ్యోమగాములు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఈ విధానం ఉపయోగపడుతోంది.