మహిళల జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, భావోద్వేగ మార్పులు, మానసిక ఒత్తిడి, ఋతు సంబంధిత ఇబ్బందులు, బరువు పెరగడం వంటివి సర్వసాధారణం. ఈ సవాళ్లను అధిగమించేందుకు మన ప్రాచీన యోగా శాస్త్రం అద్భుతంగా పనిచేస్తుంది. యోగా శరీరానికి బలాన్ని, సౌలభ్యాన్ని అందించి, మనసును ప్రశాంతపరుస్తుంది. ప్రతి మహిళ తమ దినచర్యలో చేర్చుకోవాల్సిన 8 ముఖ్యమైన యోగాసనాలు ఇక్కడ ఉన్నాయి. వీటితో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1. విపరీతకరణి: ఈ ఆసనం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాళ్లు, వీపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గర్భాశయానికి రక్త ప్రసరణను పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
2. భద్రాసనం: ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. తొడలు, పొత్తి కడుపు కండరాలను బలపరుస్తుంది. గర్భిణీలకు తుంటి కండరాలను ఫ్రీ చేసి సుఖ ప్రసవానికి సహాయపడుతుంది.
3. పర్యంకాసనం: పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి, జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. వీపు, ఉదర కండరాలకు విశ్రాంతినిస్తుంది.
4. మత్స్యాసనం: శరీర జీవక్రియలను వేగవంతం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భాశయ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
5. నతప్రార్థనాసనం: మోకాళ్లు, తుంటి కీళ్లలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. కాళ్లు, నడుము కింది భాగంలోని కండరాలను బలపరుస్తుంది. శరీర సమతుల్యతను, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
6. హస్తపాదాంగుష్ఠాసనం: కండరాలకు మంచి ఫ్లెక్సిబిలిటీని అందించి, కోర్ కండరాలను బలపరుస్తుంది. ఋతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
7. ఉత్కటాసనం: కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండే ఈ భంగిమ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కాళ్లు, పెల్విస్ కండరాలను దృఢంగా మార్చి, ఏకాగ్రతను పెంచుతుంది.
8. ధనుర్వక్రాసనం: వెన్నెముకను దృఢంగా మార్చి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్భాశయ అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరానికి నూతన శక్తిని అందిస్తుంది.

ఈ యోగాసనాలను రోజూ సాధన చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. అయితే, కొత్తగా ప్రారంభించేవారు యోగా గురువుల పర్యవేక్షణలో చేయడం మంచిది. గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ ఆసనాలను ప్రయత్నించాలి. ఈ భంగిమలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.