లోకేశ్... ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా వద్దకు వచ్చావా?: లక్ష్మీపార్వతి
- చంద్రబాబు పుట్టినరోజున నారా కుటుంబంపై లక్ష్మీపార్వతి విమర్శలు
- జగన్ ముందు నీవెంత అంటూ లోకేశ్ పై మండిపాటు
- ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా అని ప్రశ్న
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా కుటుంబ చరిత్ర మొత్తం మోసాలతో కూడుకున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నతండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులేసి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు నోరు మెదపలేదని ఆమె ప్రశ్నించారు. "లోకేశ్.. నీ స్థాయి ఎంత? జగన్ ముందు నువ్వు ఎంత?" అని ప్రశ్నించారు. ఈవీఎంల మేనేజ్‌మెంట్‌తోనే లోకేశ్ గెలిచారని ఆరోపించారు.
"ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా? మీ అమ్మకు వారంటే అయిష్టం. అసలు వారు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?" అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా దగ్గరకు వచ్చావా? అసలు నా పుట్టిన రోజు ఎప్పుడో నీకు తెలుసా? అని ప్రశ్నించారు.
అన్ని పార్టీల్లోనూ తన మనుషులను పెట్టుకుని చంద్రబాబు అడ్డదారుల్లో రాజకీయాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో, కాంగ్రెస్ లో, చివరకు కమ్యూనిస్టుల్లో కూడా చంద్రబాబే ఉన్నారని విమర్శించారు.
గత వైసీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం జగన్ చేసిన కృషిని లక్ష్మీపార్వతి కొనియాడారు. 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళా సాధికారతకు బాటలు వేశారని, నిజమైన నాయకుడు అంటే జగన్ లా ఉండాలని పేర్కొన్నారు.