గల్లా మాధవి ఏ దావా వేసినా ఎదుర్కొంటా: అంబటి రాంబాబు

Ambati Rambabu says he will face any lawsuit filed by Galla Madhavi
  • గుంటూరులో మహిళపై దాడి చేసిన ఘటనపై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న అంబటి
  • ఈ ఘటనను గల్లా మాధవి సెటిల్‌మెంట్ చేయడానికి యత్నించారని ఆరోపణ
  • ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్న

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవిపై తాను చేసిన ఆరోపణలకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాధవి స్వయంగా ఈ వ్యవహారాన్ని సెటిల్‌మెంట్ చేయడానికి ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్న సోదరి మాధవికి, నిరభ్యంతరంగా దావా వేసుకోవచ్చని తాను సవాల్ విసురుతున్నానని, ఎలాంటి న్యాయపరమైన దావానైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.


మహిళపై దాడి జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్యే మాధవి నేరుగా ఫోన్ చేసి చెప్పడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉపేక్షించారని ఆరోపించారు. గుంటూరు నడిరోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేయడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మాధవినేనని, ఒక టీడీపీ నేత ఒక మహిళ బట్టలిప్పదీసి కూర్చోబెట్టడం అత్యంత దారుణమైన విషయమని మండిపడ్డారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఒక మహిళకు రాగా, ఆమె వాటిని అందరికీ పంపించిందని, కానీ ఇప్పుడు ఆ మహిళనే టార్గెట్ చేస్తూ ఆమె సెల్ ఫోన్‌ను లాక్కున్నారని అంబటి తెలిపారు. ఆ వీడియోలు బయటకు రాకపోతే అసలు పోలీసులు కేసే నమోదు చేసేవారు కాదని దుయ్యబట్టారు. చట్టప్రకారం నడుచుకోకుండా ఎమ్మెల్యే చెప్పినట్లు వింటే భవిష్యత్తులో పోలీసులపైనే నిందలు పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... హోంశాఖ, పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ప్రజలే, ముఖ్యంగా మహిళలు ఈ ప్రభుత్వానికి పెద్ద దావా వేస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement
Ambati Rambabu
Galla Madhavi
Guntur woman attack case
YSRCP vs TDP
Andhra Pradesh politics
Andhra Pradesh police

More Telugu News