దేశంలోనే అత్యంత పిన్నవయసు చైర్ పర్సన్... పాపం, అవిశ్వాసంతో పదవిని కోల్పోయింది!

Key development in Kerala politics as young leader loses Chairperson post
  • కేరళలోని పాల మున్సిపాలిటీలో యూడీఎఫ్‌కు షాక్
  • పదవి కోల్పోయిన దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన చైర్‌పర్సన్
  • కొట్టాయం జిల్లాలో చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామం
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాల మున్సిపాలిటీలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రికార్డు సృష్టించిన నేత తన పదవిని కోల్పోయారు.

కొట్టాయం జిల్లా పరిధిలోని పాల మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్రవ్యాప్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్ పర్సన్, 21 ఏళ్ల దియా బిను పులిక్కకండంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్ కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. మొత్తం 26 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో 17 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిలో ఎల్డీఎఫ్ కౌన్సిలర్లు, స్వతంత్ర వైస్ ఛైర్మన్‌తో పాటు పార్టీ విప్‌ను ధిక్కరించిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం.

దియా బిను నేతృత్వంలోని స్వతంత్ర వర్గానికి ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. అయితే, ఈ పొత్తును పార్టీలోని కొందరు సభ్యులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అధికార కూటమిలోని ఈ అంతర్గత విభేదాలను గమనించన ఎల్డీఎఫ్, వ్యూహాత్మకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించింది.
Advertisement
Diya Binu Pulikkakandam
Pala Municipality
Kerala Politics
No Confidence Motion
Youngest Municipal Chairperson

More Telugu News