సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి నేతలు ఇక్కడకు వచ్చి అక్రమ మైనింగ్ చూడాలి: బొత్స

Botsa Satyanarayana says alliance leaders talking about Sanatana Dharma should see illegal mining
  • యలమంచిలి నియోజకవర్గంలో పంచదార్ల  కొండపై కూటమి నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న బొత్స
  • కొండల రక్షణ కోసం తాము ధర్మ పోరాటం చేస్తున్నామని వెల్లడి
  • స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి దోపిడీ చేస్తున్నారని ఆరోపణ

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 'ఛలో పంచదార్ల' పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి పంచదార్ల కొండలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పంచదార్ల కొండల రక్షణ కోసం తాము ధర్మ పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఈ కొండలను దారుణంగా దోపిడీ చేస్తున్నారని, ఇది చిన్న చిన్న వ్యక్తులు చేస్తున్న అక్రమ మైనింగ్ కాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నిత్యం సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి పెద్దలకు కళ్లు ఉంటే ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వచ్చి చూడాలి. ఈ ధర్మ పోరాటం ప్రజా ఉద్యమంలా మారకముందే జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.


పంచదార్ల కొండల దోపిడీపై తాము ప్రశ్నిస్తుంటే కూటమి నేతలు ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పవిత్రమైన కొండలను దోచుకుంటున్న కూటమి నేతలకు ఆ దేవుడి పాపం తప్పక తగులుతుందని, శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రేపటి కల్లా పంచదార్ల కొండపై మైనింగ్ వాహనాలు కనిపిస్తే అక్రమ మైనింగ్ ఆపే వరకు నడిరోడ్డుపైనే ధర్నాలు చేస్తామని, ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని బొత్స స్పష్టం చేశారు.

Advertisement
Botsa Satyanarayana
YSRCP Chalo Panchadarla protest
Anakapalli illegal mining
Panchadarla Phanigiri hills
Karanam Dharmasri
Andhra Pradesh politics

More Telugu News