దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల 

YS Sharmila criticizes Jagan for supporting BJPs Delimitation Bill
  • లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
  • ఆ బిల్లును అడ్డుకుని ఏం సాధించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలను ప్రశ్నించిన జగన్
  • జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
  • జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు తేటతెల్లమైందని వెల్లడి
  • కేసుల నుంచి రక్షణ పొందేందుకే కేంద్రానికి జగన్ దాసోహమన్నారని వ్యాఖ్యలు
  • వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని తీవ్ర విమర్శ
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బట్టబయలైందని, విపక్షం ముసుగులో ఉన్నది ఆర్ఎస్ఎస్ పక్షమేనని తేలిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. "దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.

తన ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి, కేసుల నుంచి రక్షణ పొందేందుకే జగన్ బీజేపీకి బానిసగా మారారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. "కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా? మోదీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా?" అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ సిద్ధాంతాలను, విలువలను జగన్ మంటగలిపారని, దీనిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే బిల్లును విపక్షాలు అడ్డుకుంటే, ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఏం సాధించారని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ దొంగ బిల్లుకు ఓటేసి జగన్ ఏం సాధించారని, కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని షర్మిల అన్నారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ సహా ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ బీజేపీ ప్రభుత్వం దాని అమలును ఆలస్యం చేసేందుకే డీలిమిటేషన్, జనాభా లెక్కలు అనే నిబంధనలు పెట్టిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. 2026 జనాభా లెక్కలు, కులగణన పూర్తయ్యాక, ఆ గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని వివరించారు.

అధికారిక గణాంకాలు లేకుండానే సీట్లు పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెబితే, జగన్ గుడ్డిగా నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, ఈ మూడు పార్టీలూ మోదీ మెప్పుకోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నది తామేనని ఆమె పేర్కొన్నారు.
Go Back to Shorts
Sharmila
Jagan Mohan Reddy
APCC
BJP alliance
Andhra Pradesh politics
মহিলা Reservation Bill
DeLimitation Bill
Congress Party
YS Rajasekhara Reddy
Political criticism

More Telugu News