అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!
- ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి
- ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరిన వెంకయ్య
- వెంకయ్య ప్రతిపాదనకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వెంకయ్య నాయుడు నొక్కిచెప్పారు. అమరావతికి చట్టపరమైన రక్షణ కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చే ప్రసక్తే ఉండదని, తద్వారా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి భరోసా లభిస్తుందని అమిత్ షాకు వివరించారు.
వెంకయ్య నాయుడు ప్రతిపాదనలకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అమరావతి బిల్లుకు సంబంధించిన ముసాయిదాపై న్యాయశాఖ ఇప్పటికే తన కసరత్తు పూర్తి చేసిందని, త్వరలోనే దీనిని తుది నిర్ణయం కోసం కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పోలవరం నిధులు, విభజన హామీల అమలు వంటి ఇతర రాష్ట్ర ప్రయోజనాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.