ఏపీ లిక్కర్ స్కామ్.. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్
- లిక్కర్ కుంభకోణం కేసుతో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ
- వాసుదేవరెడ్డి, రాజ్ కెశిరెడ్డి, సునీల్ కుమార్లను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్
- కస్టడీపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్న కోర్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కెశిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్లను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ మద్యం రవాణా పాలసీ విధానంలో జరిగిన అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 196.33 కోట్ల మేర గండిపడిందని ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన మద్యం రవాణా విధానాలపై పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు, కీలక పత్రాలు, టెండర్ల వివరాలను నిందితుల నుండి రాబట్టాల్సి ఉందని, అందుకే వారి కస్టడీ అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి... ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులను ఆదేశించారు. ఇరుపక్షాల ప్రాథమిక వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈనాటి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.