ANR: ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!

GV Narayana Rao Reveals Sarathi Studios Sale ANR Annapurna Story
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నడిబొడ్డున ఒకప్పుడు తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సారథి స్టూడియోస్ అమ్మకం వెనుక ఉన్న అసలు కారణాలను, నాటి సినీ పరిశ్రమలోని ఆసక్తికర పరిణామాలను సీనియర్ నటుడు, స్టూడియో భాగస్వామి కుమారుడు జీవీ నారాయణరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన విభేదాల వల్లే వేల కోట్ల విలువైన ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

నారాయణరావు తండ్రి, నవయుగా ఫిలిమ్స్ అధినేతల్లో ఒకరు. 1964లో చల్లపల్లి రాజాకు చెందిన సారథి స్టూడియోస్‌లో నవయుగా ఫిలిమ్స్ 45 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆయన తండ్రే స్టూడియో నిర్వహణ చూసుకున్నారు. అయితే, తర్వాతి తరంలో భాగస్వాముల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం, ఒకరంటే ఒకరికి పడకపోవడంతో స్టూడియోను అమ్మేయాలని నిర్ణయించినట్లు నారాయణరావు తెలిపారు. 1984 తర్వాత అమ్మినప్పుడు దాని విలువ కోట్లలో ఉందని, ఇప్పుడు అమీర్‌పేటలో ఉన్న ఆ 12 ఎకరాల స్థలం విలువ వేల కోట్లకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

'దేవదాసు' సినిమాతో ఏఎన్నార్, కృష్ణ మధ్య విభేదాలు

ఇదే ఇంటర్వ్యూలో ఆయన అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ మధ్య 'దేవదాసు' సినిమా విషయంలో తలెత్తిన తీవ్ర విభేదాల గురించి వివరించారు. ఏఎన్నార్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి ఏడాది పాటు అక్కడే ఉన్న సమయంలో, కృష్ణ హీరోగా 'దేవదాసు' రీమేక్ మొదలైంది. ఏఎన్నార్ సినిమాలను ఎక్కువగా పంపిణీ చేసే తమ సన్నిహితులకు చెందిన 'శ్రీ ఫిలిమ్స్' సంస్థే కృష్ణ 'దేవదాసు' పంపిణీ హక్కులు తీసుకుంది. ఈ పరిణామం ఏఎన్నార్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

దీంతో అమెరికా నుంచి తిరిగి రాగానే, కృష్ణ సినిమాకు పోటీగా తన పాత 'దేవదాసు' నెగటివ్‌ను కొని మళ్లీ విడుదల చేశారు. ఆ పోటీలో కృష్ణ 'దేవదాసు' ఫ్లాప్ అవ్వగా, ఏఎన్నార్ పాత 'దేవదాసు' రెండోసారి విడుదలై ఘన విజయం సాధించిందని నారాయణరావు గుర్తుచేసుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టుకకు కారణమిదే

అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఏఎన్నార్, షూటింగ్ కోసం సారథి స్టూడియోస్‌ను తెరవాలని నారాయణరావు తండ్రిని కోరారు. అయితే, అప్పటికే ఉన్న లేబర్ సమస్యల కారణంగా స్టూడియోను తెరిచేందుకు ఆయన నిరాకరించారు. దీంతో సొంతంగా ఓ స్టూడియో నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న ఏఎన్నార్, అన్నపూర్ణ స్టూడియోస్‌కు శ్రీకారం చుట్టారని నారాయణరావు తెలిపారు. "ఆరోజు మీ నాన్న స్టూడియో తెరవకుండా మొండికేయడం మంచిదే అయింది. లేదంటే నేను అన్నపూర్ణ స్టూడియో కట్టేవాడిని కాదు, మా పిల్లలకు ఇంత ఆస్తి ఉండేది కాదు" అని ఏఎన్నార్ తనతో అన్నారని ఆయన నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
Go Back to Shorts
ANR
Akkineni Nageswara Rao
Annapurna Studios
Sarathi Studios
Krishna
Devadasu movie
Telugu cinema
GV Narayana Rao
Telugu film industry
studio disputes

More Telugu News