Harshit Rana: కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్

Harshit Rana Ruled Out of IPL 2026 Due to Injury KKR Suffers Setback
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక యువ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ నెల‌ 28న టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం కేకేఆర్ బౌలింగ్ ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

గత ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా మోకాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న అతను, ఐపీఎల్ నాటికి కోలుకోవడం అసాధ్యమని తెలుస్తోంది. ఈ మేరకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' తన కథనంలో పేర్కొంది. "హర్షిత్ రాణా దురదృష్టవశాత్తూ అందుబాటులో ఉండడు. కానీ, ఇది జట్టులోని ఇతర బౌలర్లైన వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాశ్‌లకు ఒక మంచి అవకాశం. అతని స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయాలని నిర్ణయించలేదు" అని కేకేఆర్ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది.

ఇదిలా ఉంటే... హర్షిత్ రాణా దూరం కావడంపై వార్తలు రావడానికి కొన్ని గంటల ముందే కేకేఆర్ యాజమాన్యం తమ బౌలింగ్ దళాన్ని బలోపేతం చేసుకుంది. జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తైన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, తన పేస్, బౌన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 13 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.

"ముజరబానీ చేరికతో మా పేస్ దళం మరింత పటిష్ఠమైంది. టీ20 ఫార్మాట్‌లో అతనికి అపారమైన అనుభవం ఉంది" అని కేకేఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా 80కి పైగా టీ20 మ్యాచ్‌లలో 90కి పైగా వికెట్లు పడగొట్టాడని, అతని సగటు కేవలం 21గా ఉందని పేర్కొంది. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను వదులుకున్న కేకేఆర్, ఇప్పుడు ముజరబానీ రాకతో పేస్ విభాగంలో ఏర్పడిన లోటును కొంతమేర భర్తీ చేసుకున్నట్లయింది. ఒకవైపు కీలక భారత పేసర్ దూరమైనా, మరోవైపు అనుభవజ్ఞుడైన విదేశీ బౌలర్‌ను చేర్చుకోవడం ద్వారా కేకేఆర్ సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తోంది.
Harshit Rana
KKR
Kolkata Knight Riders
IPL 2026
Blessing Muzarabani
Injury
Cricket
T20 World Cup
Vaibhav Arora
Umran Malik

More Telugu News