BCCI: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన నిబంధనలు.. ప్రాక్టీస్‌పై కొత్త రూల్స్!

BCCI Announces Strict Rules for IPL Franchises Practice Sessions
  • ఒక జట్టు వాడిన నెట్స్‌లో మరో జట్టు ప్రాక్టీస్ చేయరాదన్న బీసీసీఐ
  • ప్రాక్టీస్ మ్యాచ్‌ల వివరాలను బోర్డుకు ముందుగా తెలియజేయాల‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • సీజన్ తొలి హోమ్ మ్యాచ్‌కు ముందు 4 రోజులు మైదానంలో ప్రాక్టీస్ నిషేధం
  • ప్రాక్టీస్ షెడ్యూల్‌పై వివాదం వస్తే విజిటింగ్ జట్టుకే ప్రాధాన్యం
  • ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడితే 3.5 గంటల్లో ముగించాలి
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పలు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్ల విషయంలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించే దిశగా కొత్త నిబంధనలను ప్ర‌క‌టించింది. దీని ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్‌ను లేదా నెట్స్‌ను మరో జట్టు తమ సెషన్ కోసం ఉపయోగించకూడదని స్ప‌ష్టం చేసింది.

బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టుకు వారి ప్రాక్టీస్ సెషన్ కోసం తాజాగా సిద్ధం చేసిన నెట్స్‌ను మాత్రమే కేటాయించాలి. ఒకే సమయంలో గానీ, లేదా ఒకరి తర్వాత మరొకరు గానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మొదటి జట్టు వాడిన నెట్స్‌ను రెండో జట్టు ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఒక జట్టు ముందుగా ప్రాక్టీస్ ముగించినప్పటికీ, వారి రేంజ్-హిట్టింగ్ వికెట్‌ను లేదా నెట్స్ (త్రో-డౌన్స్‌తో సహా)ను రెండో జట్టు వాడకూడదని పేర్కొంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లపైనా బీసీసీఐ స్పష్టమైన సూచనలు చేసింది. ఫ్రాంచైజీలు గరిష్ఠంగా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. అయితే, ఈ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయాలి. ఈ మ్యాచ్‌లను అసలు మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌పై నిర్వహించకూడదు. ఒకవేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనుకుంటే, దాని వ్యవధి మూడున్నర గంటలకు మించరాదని కూడా బీసీసీఐ నిర్దేశించింది.

సీజన్‌లో ఒక ఫ్రాంచైజీ తమ తొలి హోమ్ మ్యాచ్ ఆడేందుకు నాలుగు రోజుల ముందు నుంచి ప్రధాన స్క్వేర్‌పై ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు లేదా మ్యాచ్‌లు నిర్వహించరాదు. ఈ సమయంలో హోమ్ ఫ్రాంచైజీ కోరితే, సంబంధిత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది.

ప్రాక్టీస్ కోసం రెండు జట్లకు చెరో రెండు నెట్స్, రేంజ్ హిట్టింగ్ కోసం ప్రధాన స్క్వేర్‌పై ఒక నెట్‌ను కేటాయిస్తారు. ప్రాక్టీస్ షెడ్యూల్ విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే, విజిటింగ్ జట్టుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. సాధారణంగా హోమ్ జట్టుకే తొలి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, విజిటింగ్ జట్టు ప్రయాణ ఏర్పాట్లు, ముందు రోజు మ్యాచ్ ఆడి ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి అభ్యర్థనను గౌరవిస్తామని తెలిపింది.
BCCI
IPL 2026
Indian Premier League
IPL practice
BCCI rules
IPL guidelines
cricket
practice session rules
IPL franchises
cricket association

More Telugu News