Team India: రికార్డు విజయం.. భారీ ప్రైజ్ మనీ.. టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం

Rs 131 Crore Cash Reward For Team India After Historic T20 World Cup Win
  • టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ.131 కోట్ల భారీ నజరానా
  • గతంలో తానే ప్రకటించిన రూ.125 కోట్ల రికార్డును బద్దలు కొట్టిన బీసీసీఐ
  • ఐసీసీ నుంచి కూడా విజేతగా నిలిచినందుకు రూ. 27 కోట్లకు పైగా ప్రైజ్ మనీ
  • ప్రతి మ్యాచ్ గెలిచినందుకు అదనపు బోనస్‌లు కూడా అందుకున్న భారత ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో సొంత వేదిక‌పై టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ విజయంతో భారత్ మొత్తం మూడుసార్లు ఈ టోర్నీని గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈ చారిత్రక విజయం సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్టర్లకు బీసీసీఐ అభినందనలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది.

ఐసీసీ నుంచి కూడా భారీ ప్రైజ్ మనీ
బీసీసీఐ ప్రకటించిన నజరానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచినందుకు సూర్యకుమార్ సేనకు ఐసీసీ 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27.48 కోట్లు) బహుమతిగా అందించింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో 13.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మ‌నీని కేటాయించింది. ఇది గత ఎడిషన్ కంటే 20 శాతం అధికం.

ఈ ఫైనల్ విన్నింగ్ అమౌంట్‌కు అదనంగా, టోర్నీలో గ్రూప్, సూపర్ 8 దశల్లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు కూడా టీమిండియాకు బోనస్‌లు అందాయి. ప్రతి విజయానికి సుమారు 31,154 డాలర్లు (దాదాపు రూ. 28.6 లక్షలు) చొప్పున అదనపు మొత్తాన్ని భారత ఆటగాళ్లు సంపాదించారు. మొత్తంగా ఈ చారిత్రక విజయంతో భారత జట్టుపై బీసీసీఐ, ఐసీసీల నుంచి కోట్ల రూపాయల వర్షం కురిసింది.
Team India
Suryakumar Yadav
T20 World Cup 2026
BCCI
Indian Cricket Team
Prize Money
ICC
Rohit Sharma
Narendra Modi Stadium
Cricket
New Zealand

More Telugu News