Chiranjeevi: ఎన్టీఆర్ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం: చిరంజీవి

Chiranjeevi Receives NTR Award with Great Honor
  • ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు
  • గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలకు చిరంజీవి అభినందనలు
  • ఉత్తమ నటుడిగా నాగచైతన్య ఎంపికపై నాగార్జున ఆనందం
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక 'గద్దర్ చలనచిత్ర అవార్డులు-2025'లో తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి పేరు మీదుగా ఉన్న అవార్డును అందుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు 'ఎక్స్' వేదికగా చిరంజీవి స్పందిస్తూ... "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. సినీ పరిశ్రమలో ప్రతిభను, కష్టాన్ని గుర్తించి గౌరవించడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. నన్ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జ్యూరీ సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణంలో ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నాకు కొండంత బలం" అని రాసుకొచ్చారు.

కాగా, శనివారం ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది ప్రత్యేక పురస్కారాల్లో చిరంజీవితో పాటు పలువురు దిగ్గజాలకు అవార్డులు దక్కాయి. కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ అవార్డు, జయసుధకు అక్కినేని అవార్డు, నిర్మాత అశ్వినీదత్‌కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులు ప్రకటించారు. అలాగే సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్.రెడ్డి అవార్డు, రమేష్ ప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డులు లభించాయి.

చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు రావడంపై కింగ్ నాగార్జున, దర్శకుడు అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి ఏఎన్నార్ పేరిట అవార్డును నెలకొల్పినందుకు ప్రభుత్వానికి నాగార్జున ధన్యవాదాలు తెలుపుతూ, జయసుధకు ఆ అవార్డు రావడం సముచితమన్నారు. అలాగే 'తండేల్' చిత్రానికి గాను తన కుమారుడు నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికవడం పట్ల నాగ్ ఆనందం వ్యక్తం చేశారు.
Chiranjeevi
NTR Award
Gaddar Film Awards 2025
Telangana Government
Revanth Reddy
Kamal Haasan
Nagarjuna
Jay Sudha
Tollywood

More Telugu News