Sapthami Gowda: ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. హీరోయిన్ సప్తమి పోరాటానికి శివ రాజ్‌కుమార్ మద్దతు!
- హీరోయిన్ల శరీర భాగాలను జూమ్ చేస్తున్నారంటూ సప్తమి మండిపాటు
- ఇలాంటి ధోరణి తక్షణమే ఆగిపోవాలని డిమాండ్
- నటీమణులను వస్తువులుగా చూడొద్దన్న శివ రాజ్‌కుమార్
నటీమణుల పట్ల కొందరు కెమెరామెన్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రదర్శిస్తున్న వైఖరిపై కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సినిమా వేడుకల్లో నటీమణుల ప్రతిభను, వారి శ్రమను గుర్తించాల్సింది పోయి, కేవలం వారి శరీర భాగాలను అసభ్యకరంగా జూమ్ చేస్తూ వీడియోలు తీయడంపై 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ ఘాటుగా స్పందించింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ ముసుగులో జరుగుతున్న ఈ "బాడీ ఆబ్జెక్టిఫికేషన్" సంస్కృతి సమాజ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వ్యూస్ కోసం నటీమణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ధోరణి తక్షణమే ఆగిపోవాలని ఆమె డిమాండ్ చేసింది.
ఈ అంశంలో సప్తమి గౌడకు ప్రముఖ సినీ నటుడు శివ రాజ్‌కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన లేఖను విడుదల చేసిన ఆయన, మహిళలను గౌరవించడం అనేది ఒక ప్రాథమిక సంస్కారమని గుర్తుచేశారు. నటీమణులను కేవలం వస్తువులుగా చూడటం ఆపేయాలని హితవు పలుకుతూ, #ActorsNotObjects అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ 'జూమ్ కల్చర్'కు వ్యతిరేకంగా తన నిరసనను తెలియజేశారు. ఆయన కుమార్తె, నిర్మాత నివేదిత రాజ్‌కుమార్ కూడా ఈ గళానికి తోడై, మహిళలను కేవలం ఒక శరీరంగా చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే జాతీయ స్థాయిలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి అగ్ర తారలు ఇటువంటి అసభ్యకర ఫొటోగ్రఫీపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కన్నడ పరిశ్రమ నుంచి రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్, దివ్య స్పందన వంటి నటీమణులు కూడా సప్తమికి బాసటగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రస్తుతం పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది.