Nara Lokesh: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్.. బాధితుల కుటుంబాలకు ఉద్యోగ భరోసా: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Government to End Faction Politics Job Assurance for Victims Families
  • ఫ్యాక్షన్ బాధితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లోకేశ్‌
  • బీసీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగంతో ఈ చట్టం అమలుకు శ్రీకారం
  • ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే తమ లక్ష్యమన్న మంత్రి
  • వైఎస్ హయాంలో రాష్ట్రంలో మారణహోమం జరిగిందని ఆరోపణ
  • గత ప్రభుత్వం ఈ బిల్లును కౌన్సిల్‌లో ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని విమర్శ
రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఫ్యాక్షన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టం తీసుకొస్తున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో "ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లు"ను ఆయన ఇవాళ‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒక వ్యక్తికో, పార్టీకో సంబంధించింది కాదని, ఫ్యాక్షన్ రహిత సమాజ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. "2022 జనవరి 12న బీసీ నాయకుడు తోట చంద్రయ్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన దృశ్యాలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. కేవలం పసుపు జెండా వీడనన్నందుకు, జై చంద్రబాబు అన్నందుకు ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. అటువంటి త్యాగధనుడి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించాం. ఇది కేవలం టీడీపీ నిర్ణయం కాదు, కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించగా, ఇది చాలా మంచి నిర్ణయమని ఆయన సమర్థించారు. బీజేపీతో సహా కూటమి పక్షాలన్నీ దీనికి మద్దతు తెలిపాయి" అని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును శాసనసభలో ఆమోదించి మండలికి పంపితే, అక్కడ ఉద్దేశపూర్వకంగానే దానిని తొక్కిపెట్టారని లోకేశ్‌ ఆరోపించారు. ఒక బీసీ బిడ్డకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, అయినా నిబంధనల ప్రకారం మరోసారి ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండ ఉంటే, వారి జోలికి రావడానికి ప్రత్యర్థులు భయపడతారనే ఉద్దేశంతోనే ఈ చట్టం చేస్తున్నామని, ఇది ఒకరికి మేలు చేయడం కాదని, మొత్తం సమాజానికి మేలు చేసే బాధ్యత అని ఆయన అన్నారు.

గతాన్ని గుర్తుచేసిన లోకేశ్‌
రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్రను లోకేశ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. "1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్షనిజంపై యుద్ధం ప్రకటించారు. కానీ, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక తొలి రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా 164 మంది టీడీపీ కార్యకర్తలను కిరాతకంగా హత్య చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మారణహోమం సృష్టించారు. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపే మరో హత్య వార్త వినాల్సి వచ్చేది. ఆనాడు ఫ్యాక్షన్ బాధితుల పిల్లలు మళ్లీ అవే దారుల్లో పయనించకూడదని చంద్రబాబు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, వారిని సొంత బిడ్డల్లా చదివించారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు" అని లోకేశ్‌ వివరించారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించి, ఫ్యాక్షన్ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి సహకరించాలని ఆయన సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
faction politics
Tota Chandraiah
Pawan Kalyan
YS Rajasekhara Reddy
Chandrababu Naidu
AP Public Service
political violence
BC leader

More Telugu News