Kavitha: హైడ్రాకు ఈ అక్రమ వెంచర్లు కనిపించడం లేదా.. వీటికి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారు: కవిత

Kavitha Questions HYDRA on Illegal Ventures Near Moosi River
  • నార్సింగిలో అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయంటూ కవిత ఆందోళన
  • ఈ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్
  • బీఆర్ఎస్ హయాంలో ఇక్కడి భవనాలకు అనుమతులు ఇచ్చారని విమర్శలు
  • కాంగ్రెస్ లంచాలు తీసుకుని వాటికి మళ్లీ అనుమతులు ఇచ్చిందన్న కవిత
హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్మిస్తున్నారని, వాటిపై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. అక్కడి వెంచర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇళ్లు కూల్చివేస్తున్న హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని నిలదీశారు. కుత్బుల్లాపూర్, ఖమ్మం వెలుగుమట్ల, మూసీ నది పరిసరాల్లో అన్నీ పేదల ఇళ్లనే కూల్చుతున్నారని ఆరోపించారు. జనం బాటలో భాగంగా అక్రమ ఇళ్ల నిర్మాణాలను హైడ్రా దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చవద్దని కూడా విజ్ఞప్తి చేశామని అన్నారు.

మూసీ నది పక్కన ఉన్న పేదల ఇళ్లను కూల్చిన హైడ్రా అధినేత రంగనాథ్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నదిలోనే నిర్మిస్తున్న అక్రమ వెంచర్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అవసరమైతే రంగనాథ్ బుల్డోజర్ తీసుకువచ్చేవరకు ఇక్కడే నిరసన చేపడతామని హెచ్చరించారు. ఖమ్మం కూడా వెళ్లి పేదల తరఫున కొట్లాడుతామని అన్నారు. 20 ఏళ్ల క్రితం కట్టిన మధ్యతరగతి వారు కొనుగోలు చేసిన అపార్టుమెంట్‌ను కూలగొట్టాలని చెబుతున్నారని, కానీ ధనికుల నిర్మాణాలకు మాత్రం అడ్డంకులు లేవని మండిపడ్డారు.

ఈ అక్రమ భవనాలకు బీఆర్ఎస్ హయాంలో అనుమతులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలు నిలిచిపోయాయని అన్నారు. ఆ తర్వాత లంచాలు తీసుకుని నిర్మాణాలకు తిరిగి పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకేలా ఉండాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని కవిత అన్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Moosi River
Narsingi
Real Estate Ventures
Illegal Construction

More Telugu News