India vs West Indies: విండీస్‌తో భారత్ డూ ఆర్ డై.. పరుగుల పిచ్‌పై అసలు సిసలు ఫైట్!

India vs West Indies T20 World Cup Do or Die Match at Eden Gardens
  • భారత్, వెస్టిండీస్ మధ్య వర్చువల్ క్వార్టర్ ఫైనల్ పోరు
  • ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారిన పిచ్‌పై మ్యాచ్
  • స్పిన్నర్లు, పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం
  • పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
  • ఇప్పటికే ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు గెలిచిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్‌లో రేపు భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. ఈ కీలకమైన సూపర్-8 పోరుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తుండగా, టోర్నీలో తొలిసారి 200 పైచిలుకు స్కోరు నమోదైన పిచ్‌పైనే ఈ మ్యాచ్ నిర్వహించనుండటం తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ రేసులో ముందంజ వేయనుండగా, ఓడిన జట్టు దాదాపుగా ఇంటిముఖం పట్టనుంది.

నిన్న‌ సాయంత్రం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు. బీసీసీఐ చీఫ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్‌తో కలిసి స్థానిక క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో గంగూలీ చాలాసేపు చర్చించాడు. పిచ్ తయారీపై గంగూలీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. "ఇది పరుగుల వరద పారించే ఈడెన్ వికెట్. అయితే, బౌలర్లకు కూడా ఎంతో కొంత సహకారం లభిస్తుంది" అని సుజన్ ముఖర్జీ పీటీఐకి తెలిపాడు. మ్యాచ్‌పై మంచు ప్రభావం కూడా గణనీయంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఇదే పిచ్‌పై ఈ నెల‌ 9న జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు ఇటలీపై 207/4 భారీ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ మైఖేల్ లీస్క్ 4/17 ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పిచ్ పొడిగా ఉండే అవకాశం ఉన్నందున, స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈడెన్ పిచ్‌లో మంచి బౌన్స్, క్యారీ కూడా లభిస్తుండటంతో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా రాణించేందుకు ఆస్కారం ఉంది.

ఈ టోర్నీలో భారత జట్టు ఈడెన్‌లో ఆడటం ఇదే తొలిసారి. కాగా, వెస్టిండీస్‌కు ఇది స్వల్ప ప్రయోజనం చేకూర్చే అంశం. విండీస్ ఇప్పటికే ఈ మైదానంలో స్కాట్లాండ్, ఇటలీలపై రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. గత మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ గెలవడంతో ఈ సూపర్-8 మ్యాచ్ ఇరు జట్లకు 'డూ ఆర్ డై'గా మారింది.
India vs West Indies
T20 World Cup
Eden Gardens
Saurav Ganguly
Jasprit Bumrah
Hardik Pandya
Arshdeep Singh
Kolkata pitch report
Cricket Association of Bengal
Sujan Mukherjee

More Telugu News