Somu Veerraju: రూ. 329కే కిలో నెయ్యి ఎలా వస్తుంది?: సోము వీర్రాజు
- ఇంట్లో వాడే నాణ్యమైన నెయ్యి కిలో రూ.2 వేలు పలుకుతోందన్న వీర్రాజు
- తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదని వ్యాఖ్య
- నెయ్యి విషయంలో డ్రామాలు ఆడితే దేవుడు క్షమించడని హెచ్చరిక
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బీజేపీ శాసనమండలి పక్ష నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రావడం అసాధ్యమని, ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని మండిపడ్డారు.
సాధారణంగా మనం ఇంట్లో వాడే నాణ్యమైన నెయ్యి కిలో రూ. 2 వేలు పలుకుతుంటే, కోట్లాది మంది ఆరాధించే వేంకటేశ్వరస్వామి ప్రసాదం కోసం రూ.329కే నెయ్యి ఎలా కొంటారని సోము వీర్రాజు నిలదీశారు. "రూ. 329కి నెయ్యి కొన్న వారు, ఇప్పుడు రూ. 658కి కొంటారా అని వితండవాదం చేస్తున్నారు. తక్కువ ధరకే ఆవు నెయ్యి వస్తుందంటూ డ్రామాలు ఆడితే దేవుడు కూడా క్షమించడు" అని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదం విషయంలో రాజీ పడకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్న ఆవేదనతోనే తాను చైర్మన్‌ను కలవడానికి వెళ్లానని, అయితే తనపై దాడికి ఉసిగొల్పడం దారుణమని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. "లక్షన్నరకు పైగా జీతం తీసుకుంటూ సభలో ప్రజల పక్షాన ప్రశ్నించే అవకాశం లేకపోతే బాధగా ఉంటుంది. ప్రశ్నలు వాయిదా వేయవద్దని కోరడానికి వెళితే అడ్డుకోవడం ఎంతవరకు సబబు?" అని ప్రశ్నించారు. సభలో ప్రశ్నల సమయంలో ప్రతిపక్షానికి 20 నిమిషాల సమయం ఇచ్చి, సమాధానం చెప్పాల్సిన మంత్రికి కేవలం 7 నిమిషాలే ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రశ్నలా కాకుండా ప్రసంగంలా సాగుతోందని ఎద్దేవా చేశారు.