Suravaram Sudhakar Reddy: కేంద్ర మంత్రి పేరుతో మోసం.. సురవరం భార్యకు రూ.11 లక్షల టోకరా!

Suravaram Sudhakar Reddys Wife Loses 11 Lakhs in Cyber Fraud
  • కేంద్ర మంత్రి నిర్మల పేరుతో నకిలీ ప్రకటన
  • పెట్టుబడి ఆశ చూపి రూ.11 లక్షల వసూలు
  • దఫదఫాలుగా డబ్బు కాజేసిన కేటుగాళ్లు
  • సైబరాబాద్ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ప్రముఖుల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య బీవీ విజయలక్ష్మి (75) సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి సుమారు రూ.11 లక్షలు పోగొట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న నకిలీ ప్రకటనను నమ్మి ఆమె ఈ మోసానికి గురయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్‌లో విజయలక్ష్మి సోషల్ మీడియాలో ఓ పెట్టుబడి ప్రకటనను చూశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోతో ఉన్న ఆ ప్రకటనలో సెబీ గుర్తింపు పొందిన 'క్వాంటాపల్స్' అనే సంస్థ ద్వారా ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఉంది. అది నిజమని నమ్మిన ఆమె, అందులో ఉన్న లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆమెకు వాట్సాప్‌లో 'ఆదిత్య సుబ్రహ్మణ్యం' అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత రూ.13 వేలు కట్టించుకున్నాడు.

ఆపై పెట్టుబడి పేరుతో జనవరి 30న రూ.1.99 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యూకే నుంచి 'ఆడమ్ స్మిత్' అనే మరో వ్యక్తి ఫోన్ చేసి, లాభాలు డాలర్లలో వచ్చాయని నమ్మించాడు. అయితే, లావాదేవీలు రద్దయ్యాయని, ట్యాక్స్ కట్టాలని చెప్పి విడతల వారీగా ఫిబ్రవరి 13 వరకు మొత్తం రూ.10.91 లక్షలు కాజేశాడు. పదేపదే డబ్బు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన విజయలక్ష్మి, తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ముఖాలతో వచ్చే నకిలీ, డీప్ ఫేక్ వీడియో ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో కనిపించే అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
Suravaram Sudhakar Reddy
Suravaram Sudhakar Reddy wife
cyber crime
Nirmala Sitharaman
online fraud
cyber fraud
Quantaplus
investment scam
Hyderabad cyber crime

More Telugu News