Nara Lokesh: పారిశ్రామికాభివృద్ధికి 'క్లస్టర్' వ్యూహం.. ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Nara Lokesh Announces Cluster Based Industrial Growth for Job Creation
  • క్లస్టర్ల విధానంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళిక
  • రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల గుర్తించామ‌న్న మంత్రి లోకేశ్‌
  • ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలకు 'నైపుణ్యం' పోర్టల్
  • పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల బలోపేతం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసి, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం 'క్లస్టర్ బేస్డ్' విధానంతో ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. సూపర్-6 హామీల్లో భాగంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ ప్రణాళికను ఆయన వివరించారు.

ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు లోకేశ్‌ తెలిపారు. రాయలసీమలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, కడప-చిత్తూరుల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, నెల్లూరులో గ్లాస్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ వంటి క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే చోట ప్రధాన పరిశ్రమలతో పాటు వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పడం ద్వారా బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్) నిర్మించడమే తమ లక్ష్యమని వివరించారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో తయారయ్యే ప్రతి 100 ఏసీలలో 50 మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయని, డైకిన్, ఎల్జీ వంటి కంపెనీలు తమకు అవసరమైన కోర్సులను ఐటీఐలలో ప్రవేశపెట్టాలని కోరాయని చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో కోర్సుల కరిక్యులమ్ మార్చి, యువతకు నాణ్యమైన శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ఎస్‌డీసీ, సీడాప్, న్యాక్ ద్వారా 73,000 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 40,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు సులభంగా కల్పించేందుకు 'నైపుణ్యం' పేరుతో ఒక వినూత్న పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత టెక్నాలజీతో ఈ పోర్టల్ పనిచేస్తుందని, దీని ద్వారా యువత తమ నైపుణ్యాలను స్వయంగా అంచనా వేసుకోవచ్చని, రెస్యూమ్ తయారు చేసుకోవచ్చని, ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకోవచ్చని వివరించారు. ఏఐ ట్యూటర్ ద్వారా ఇంటర్వ్యూలకు కూడా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటివరకు నిర్వహించిన 1,587 జాబ్ మేళాల ద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో ప్రపంచస్థాయి కార్మికులను తయారు చేసేందుకు న్యాక్‌ను 90 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేస్తామని మంత్రి లోకేశ్‌ సభకు హామీ ఇచ్చారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh industries
AP cluster development
Job creation AP
APSSDC
Skill development Andhra Pradesh
AP employment
Naipunya portal
AP job melas
Industrial development AP

More Telugu News