మార్కెట్లపై ట్రంప్ దెబ్బ... కుప్పకూలిన సెన్సెక్స్

Donald Trump Impact Sensex Crashes Amid Market Turmoil
షార్ట్స్‌లో చూడండి
అమెరికా వాణిజ్య విధానాలపై తాజాగా తలెత్తిన ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. గత నాలుగు రోజుల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు నష్టపోయి 82,225.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.35 పాయింట్లు తగ్గి 25,424.65 వద్ద స్థిరపడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా 15 శాతం తాత్కాలిక టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటాయన్న భయాలు మొదలయ్యాయి. గతంలో ఆయన విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ట్రంప్ తాజా హెచ్చరికలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా ప్రతికూలంగా పడింది.

ఈ అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. అమెరికా టెక్నాలజీ వ్యయంపై ఆందోళనలు, బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.74 శాతం పతనమై 30,053.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఈ సూచీ రెండేళ్ల కనిష్ఠ స్థాయిని కూడా తాకింది. ఐటీ తర్వాత రియాల్టీ రంగం 2.54 శాతం నష్టపోయింది. అయితే, మెటల్ ఇండెక్స్ మాత్రం మార్కెట్ పతనంలోనూ కాస్త మెరుగ్గా నిలిచింది.

విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీకి 25,500–25,600 స్థాయి కీలక నిరోధకంగా ఉంది. దీనిపైన నిలదొక్కుకుంటేనే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ 25,300 స్థాయికి దిగువకు పడిపోతే, అమ్మకాల ఒత్తిడి మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఏఐ టెక్నాలజీపై ఆందోళనల కారణంగా మార్కెట్లు సమీప భవిష్యత్తులో అస్థిరంగానే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Donald Trump
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
US Trade Policy
Market Crash
Share Market
Global Markets
IT Stocks

More Telugu News