ఫోన్ల ఈఎంఐలు చెల్లించకపోతే.. ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

RBI new rules for non payment of phone EMIs
  • 2027 జనవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాల అమలు
  • 30 రోజుల బకాయి తర్వాతే ఫోన్లపై పరిమితులకు అనుమతి
  • 60 రోజులు దాటితేనే పూర్తి స్థాయిలో ఫోన్ లాక్
  • ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్, ఎస్‌వోఎస్ సేవలు కొనసాగింపు
  • బకాయి చెల్లించిన గంటలోపే ఫోన్ అన్‌లాక్ తప్పనిసరి
  • ఆలస్యమైతే గంటకు రూ.250 పరిహారం
స్మార్ట్‌ఫోన్‌ను ఈఎంఐపై కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాయిదాలు చెల్లించకపోతే రుణ సంస్థలు ఫోన్‌ను రిమోట్ ద్వారా లాక్ చేసే ఘటనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల వంటి రుణదాతలు పాటించాల్సిన కొత్త నిబంధనలను ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం.. ఈఎంఐ చెల్లించలేదని వెంటనే ఫోన్‌ను లాక్ చేయడానికి వీల్లేదు. ఫోన్ కొనుగోలు కోసం తీసుకున్న రుణం 30 రోజుల పాటు బకాయిగా ఉంటేనే పరిమితులు విధించవచ్చు. పూర్తిగా ఫోన్‌ను లాక్ చేయాలంటే బకాయి 60 రోజులు దాటాలి.

ఈ నిబంధనలు ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలకే వర్తిస్తాయి. వ్యక్తిగత రుణం లేదా ఇతర రుణాల పేరుతో ఇప్పటికే ఉన్న ఫోన్‌ను రిమోట్ ద్వారా లాక్ చేసే అధికారం రుణదాతలకు ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఫోన్‌పై పరిమితులు విధించినా కొన్ని సేవలు తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశించింది. ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్, అత్యవసర ఎస్‌వోఎస్ సదుపాయం, ఉద్యోగానికి అవసరమైన కీలక ఫీచర్లు అందుబాటులో ఉండాలి. దీంతో రుణగ్రహీత పూర్తిగా ఇబ్బంది పడకుండా చూడాలని సూచించింది.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి కూడా ఆర్‌బీఐ రక్షణ కల్పించింది. ఫోన్‌లోని కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు, ఎస్‌ఎంఎస్‌లు, కాల్ వివరాలు, లొకేషన్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు చూడకూడదు. డేటా రక్షణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

ఫోన్‌ను లాక్ చేసే ముందు వినియోగదారుడికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. రుణం మంజూరు చేసే సమయంలోనే ఈ నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేయాలి. అలాగే పరిమితులు అమలు చేసే ముందు మరోసారి సమాచారం ఇచ్చి బకాయిలు చెల్లించే అవకాశం కల్పించాలి.

బకాయి మొత్తం చెల్లించిన తర్వాత సాధారణంగా గంటలోపే ఫోన్‌పై ఉన్న పరిమితులను తొలగించాలి. ఒకవేళ గంట దాటినా ఫోన్‌ను అన్‌లాక్ చేయకపోతే ప్రతి గంట ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం చెల్లించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
Advertisement
RBI
Phone EMI rules
Remote lock guidelines
Consumer protection
Digital lending regulations
EMI default penalty

More Telugu News