Shimron Hetmyer: హెట్మెయర్ వీరబాదుడు... జింబాబ్వే ముందు కొండంత టార్గెట్

Hetmyer Heroics West Indies Set Massive Target Against Zimbabwe
  • టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8 మ్యాచ్
  • చెలరేగిన హెట్మెయర్
  • 34 బంతుల్లో 7 సిక్సర్లతో 85 పరుగులు
  • వెస్టిండీస్ భారీ స్కోరు 254/6
  • రాణించిన రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్
  • జింబాబ్వే ముందు 255 పరుగుల భారీ లక్ష్యం
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో వెస్టిండీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా, విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. హెట్మెయర్ వీరబాదుడుతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇన్నింగ్స్ ఆరంభంలో వెస్టిండీస్ 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్మెయర్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి 250 స్ట్రైక్ రేట్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 59) అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 122 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు.

హెట్మెయర్, పావెల్ ఔటయ్యాక కూడా విండీస్ దూకుడు తగ్గలేదు. చివర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (13 బంతుల్లో 31 నాటౌట్), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 21), జాసన్ హోల్డర్ (4 బంతుల్లో 13) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో స్కోరు 250 మార్కును దాటింది. హెట్మెయర్ సహా ఇతర విండీస్ బ్యాటర్ల ధాటికి జింబాబ్వే బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ సికిందర్ రజా 3 ఓవర్లలోనే 52 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఫలితంగా, జింబాబ్వే ముందు 255 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది.
Shimron Hetmyer
Hetmyer
West Indies
Zimbabwe
T20 World Cup 2026
Rovman Powell
Sherfane Rutherford
Romario Shepherd
Wanhede Stadium
Cricket

More Telugu News