Zimbabwe Cricket: టీ20 వరల్డ్ కప్: వారెవ్వా జింబాబ్వే... శ్రీలంకను కూడా కొట్టేసింది!

Zimbabwe defeats Sri Lanka in T20 World Cup
  • టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే మరో సంచలన విజయం
  • ఆతిథ్య శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపు
  • బెన్నెట్ అజేయ హాఫ్ సెంచరీ, కెప్టెన్ రజా మెరుపు ఇన్నింగ్స్
  • గ్రూప్-బిలో అజేయంగా నిలిచి టాపర్‌గా సూపర్-8కు జింబాబ్వే
  • ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన ఆ జట్టు
టీ20 ప్రపంచకప్‌ 2026లో సంచలనాలకు మారుపేరుగా మారిన జింబాబ్వే తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి, వారి సూపర్-8 అవకాశాలపై చావుదెబ్బకొట్టిన జింబాబ్వే జట్టు, తాజాగా ఆతిథ్య శ్రీలంకకు కూడా సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచి, అజేయంగా సూపర్-8 దశలోకి అడుగుపెట్టింది.

శ్రీలంక నిర్దేశించిన 179 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి కెప్టెన్ సికందర్ రజా (26 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన మెరుపు ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 40 బంతుల్లోనే 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ జింబాబ్వే వైపు తిరిగింది. ఆరంభంలో మరో ఓపెనర్ మరుమాని (26 బంతుల్లో 34) కూడా వేగంగా ఆడాడు. చివరిలో టోనీ మున్యోంగా (3 బంతుల్లో 8 నాటౌట్) ఒక సిక్సర్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (41 బంతుల్లో 62) హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44) దూకుడుగా ఆడి స్కోరును పెంచాడు. కుశాల్ పెరీరా (22) ఫర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో గ్రేమ్ క్రీమర్, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఇవాన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించినప్పటికీ, సొంత ప్రేక్షకుల మధ్య ఈ ఓటమి శ్రీలంకకు నిరాశ కలిగించింది. మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచి, ఒక మ్యాచ్ (ఐర్లాండ్ తో) రద్దు కావడంతో మొత్తం 7 పాయింట్లతో అజేయంగా నిలిచిన జింబాబ్వే.. టైటిల్ ఫేవరెట్ జట్లకు గట్టి హెచ్చరికలు పంపుతూ సూపర్-8కు దూసుకెళ్లింది.

Zimbabwe Cricket
T20 World Cup
Sri Lanka
Sikandar Raza
Brian Bennett
Graeme Cremer
Blessing Muzarabani
T20 World Cup 2026
Cricket News

More Telugu News