KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR Demands Funds for Congress Promises in Open Letter to Revanth Reddy
  • రాబోయే బడ్జెట్‌లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్
  • ఆరు గ్యారెంటీలు సహా 95 శాతం హామీలు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శ
  • నిధులు కేటాయించకపోతే ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిక
  • గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న బీఆర్ఎస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పదవీకాలం పూర్తికావస్తున్న తరుణంలో, ఇచ్చిన హామీల అమలుకు రాబోయే బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా చిత్తశుద్ధి చూపాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.

ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటి అమలును పూర్తిగా పక్కన పెట్టిందని కేటీఆర్ తన లేఖలో విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. గత రెండు బడ్జెట్లలోనూ హామీల అమలుకు అవసరమైన కేటాయింపులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్‌లో అయినా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతుల కోసం ఇచ్చిన హామీల మేరకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓపిక నశిస్తోందని, వారిని ఇకపై వేచి చూసేలా చేయవద్దని సూచించారు.

కేవలం గ్యారెంటీలే కాకుండా, ఎన్నికలకు ముందు వివిధ డిక్లరేషన్ల రూపంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కేటీఆర్ కోరారు. గత రెండేళ్లుగా ఆయా వర్గాలకు చెల్లించాల్సిన నిధులు, బకాయిలను ఈ బడ్జెట్‌లో చేర్చి వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు.

ఒకవేళ ఈ బడ్జెట్‌లో కూడా హామీల అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా 'మోసకారి కాంగ్రెస్'ను ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తాం అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజం ఇంకెంతమాత్రం ఓపికపట్టే స్థితిలో లేదని, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తామని తన లేఖలో స్పష్టం చేశారు.
KTR
KT Rama Rao
Revanth Reddy
Telangana Budget
Congress Guarantees
Telangana Government
BRS Party
Telangana Politics
Welfare Schemes
Budget Allocations

More Telugu News