హైదరాబాద్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్.. రాష్ట్రాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్.. రాష్ట్రాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy addresses Samakhya Business Summit on Telangana development goals
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను చేస్తామన్న సీఎం
  • దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వెల్లడి
  • కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలని వ్యాఖ్య
2047వ సంవత్సరం నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈరోజు 'సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై తమ ప్రభుత్వ దార్శనికతను వివరించారు.

ఈ భారీ లక్ష్య సాధనలో భాగంగా 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రగతి ప్రణాళికలు ఉన్నాయని, ఈ లక్ష్య సాధనకు కేంద్ర, రాష్ట్రాల సహకారం అవసరమని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని... అభివృద్ధి విషయంలో కాదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం 'CURE, PURE, RARE' అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఐటీ, సేవల కోసం 'కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ' (CURE), ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య తయారీ రంగం కోసం 'పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ' (PURE), మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 'రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ' (RARE) జోన్లను అభివృద్ధి చేస్తామన్నారు.

ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌కు ఉన్న 400 ఏళ్ల కాస్మోపాలిటన్ సంస్కృతిని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. యువత, మహిళలు పారిశ్రామిక రంగంలోకి ఎక్కువగా రావాలని పిలుపునిచ్చారు. సమఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల సదస్సు జరుగుతుండగా, ప్రారంభోత్సవంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Revanth Reddy
Samakhya Business Summit 2026
Telangana 3 Trillion Dollar Economy
Hyderabad Business Summit
CURE PURE RARE Strategy
Telangana Economic Development

More Telugu News