76 ఏళ్ల వయసులోనూ తగ్గని మ్యాజిక్‌.. రజనీపై అనిరుధ్‌ అదిరిపోయే కామెంట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

76 ఏళ్ల వయసులోనూ తగ్గని మ్యాజిక్‌.. రజనీపై అనిరుధ్‌ అదిరిపోయే కామెంట్‌!

Rajinikanth magic continues at age 76 Anirudh Ravichander amazing comments
  • 51 ఏళ్ల సినీ ప్రయాణంలో చరిత్ర సృష్టిస్తున్నారని ప్రశంస
  • ‘జైలర్‌ 2’ విడుదలకు ముందు ‘ఎక్స్‌’లో పోస్టు
  • ‘ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు.. ఒకే రజనీ’ అని వ్యాఖ్య
  • సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌
  • అక్టోబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల 
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న పేరు. వయసు పెరుగుతున్నా ఆయన తెరపై చూపించే మ్యాజిక్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ విషయాన్నే ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ మరోసారి గుర్తుచేశాడు. 76 ఏళ్ల వయసులోనూ రజనీ చరిత్రను తిరగరాస్తున్నారని ప్రశంసించాడు. ఆయన నటించిన ‘జైలర్‌ 2’ విడుదలకు ముందు అనిరుధ్‌ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

‘జైలర్‌ 2’పై అనిరుధ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. తరతరాలుగా రజనీకాంత్‌ ప్రేక్షకులకు ఆనందం, నవ్వులు, ఉత్కంఠతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను అందించారని పేర్కొన్నాడు. 51 ఏళ్ల సినీ ప్రయాణంలోనూ ఆయన కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉన్నారని కొనియాడాడు.

గురువారం ‘జైలర్‌ 2’ విడుదల సందర్భంగా మరోసారి ప్రపంచమంతా రజనీపై అభిమానాన్ని చూడబోతోందని అనిరుధ్‌ అన్నాడు. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నాడు. ‘ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు.. ఒకే రజనీ’ అంటూ తన పోస్టులో అభిమానాన్ని చాటుకున్నాడు.

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌ 2’కు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సన్‌ పిక్చర్స్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. అక్టోబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపించారు. ఆయన ఆచూకీ కోసం విలన్లు వెతుకుతుంటారు. అయితే శత్రువుల వ్యవస్థలో పైస్థాయిలో ఎవరున్నారో తెలుసుకునేందుకు రజనీ డ్రైవర్‌ వేషంలో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో కనిపించగా.. విద్యాబాలన్‌తో రజనీ సంభాషణలు కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Advertisement
Rajinikanth
Anirudh Ravichander
Jailer 2
Nelson Dilipkumar
Sun Pictures
Tamil Cinema News

More Telugu News