Dalai Lama: దలైలామాకు గ్రామీ అవార్డు.. తీవ్రంగా స్పందించిన చైనా

Dalai Lama wins Grammy Award China reacts strongly
  • 90 ఏళ్ల వయస్సులో మెడిటేషన్ అనే ఆల్బమ్‌కు అవార్డు
  • దలైలామా పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదన్న చైనా
  • చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయస్సులో 'మెడిటేషన్' అనే ఆల్బమ్‌కు గాను దలైలామాను ఈ అవార్డు వరించింది. దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. దీనిని ఉపయోగించుకుని చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.

దలైలామా పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఓ మీడియా సమావేశంలో అన్నారు. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని ఆయనపై ఆరోపణలు గుప్పించారు.

ఈ అవార్డును బీజింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సాధనంగా ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే వ్యక్తి అన్నారు.

తనకు గ్రామీ అవార్డు రావడంపై దలైలామా స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా చూడటం లేదని అన్నారు. శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం అనేవి మానవాళి శ్రేయస్సుకు అవసరమని పేర్కొన్నారు. గ్రామీ గుర్తింపు ఈ సందేశాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.
Dalai Lama
Grammy Award
China
Tibet
Meditation Album
Lin Jian
Chinese Foreign Ministry

More Telugu News