Ukraine war: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. నిప్రోలో డ్రోన్‌ దాడిలో 15 మంది మృతి

Ukraine War 15 Killed in Russian Drone Attack in Nipro
  • నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని గనులను లక్ష్యంగా చేసుకుని రష్యా పెద్దఎత్తున దాడులకు పాల్పడిందన్న డీటీఈకే సంస్థ 
  • బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గని కార్మికులు మృతి చెందినట్లు వెల్లడి
  • ఉక్రెయిన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని రష్యా అంగీకరించినట్లు ఇటీవలే ప్రకటించిన ట్రంప్
యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్‌ దాడి జరిపింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు గుర్తించారు. 

దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లో అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ డీటీఈకే వెల్లడించింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని డీటీఈకే గనులను లక్ష్యంగా చేసుకుని రష్యా పెద్దఎత్తున దాడులకు పాల్పడిందని సంస్థ ఆరోపించింది. షిఫ్ట్‌ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కార్మికుల బస్సుపై డ్రోన్‌ దాడి జరిగినట్లు తెలిపింది. ఘటన స్థలంలో తీవ్ర మంటలు చెలరేగాయని పేర్కొంది. 

కనిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని రష్యా అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇదిలా ఉండగా అమెరికా, ఉక్రెయిన్‌, రష్యాల మధ్య మరో విడత త్రైపాక్షిక సమావేశాల తేదీలు ఖరారయ్యాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబిలో ఈ చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు. సమగ్ర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమావేశాలు యుద్ధం ముగింపునకు దారి చూపుతాయని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Ukraine war
Russia Ukraine conflict
Nipro drone attack
Volodymyr Zelensky
DTEK
Nipro
Donal Trump
Russia attacks
Ukraine war negotiations
Abu Dhabi talks

More Telugu News