ఏపీలో ఆర్‌ఎంజెడ్ రూ.83 వేల కోట్ల పెట్టుబడులు... దావోస్‌లో మంత్రి నారా లోకేశ్ ప్రకటన
- దావోస్ వేదికగా ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
- ప్రముఖ సంస్థ ఆర్‌ఎంజెడ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
- విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, డేటా సెంటర్ ఏర్పాటు
- రాయలసీమలో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణం
- ఈ ప్రాజెక్టుల ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా
ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో 10 మిలియన్ చదరపు అడుగుల (1 కోటి చ.అ.) విస్తీర్ణంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులతో విశాఖ నగరాన్ని కీలకమైన డిజిటల్, జీసీసీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాంతీయ సమాన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌ను కూడా ఈ భాగస్వామ్యంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇది రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన విధానాలు, పనులను కచ్చితంగా పూర్తిచేసే సామర్థ్యం, వేగంగా వ్యాపార అనుమతులు ఇవ్వడంలో మా నిబద్ధతే ఈ భారీ పెట్టుబడికి కారణం" అని వివరించారు. ఐటీ, డేటా సెంటర్లు, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడితో రాష్ట్ర ముఖచిత్రం మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.