Nara Lokesh: వాళ్లు 5 ఏళ్లలో సాధించలేనిది మేం ఏడాదిలో సాధించాం!: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Comments on One Year Achievements of TDP Government
షార్ట్స్‌లో చూడండి
జూన్ 4... రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు...  బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కూటమి పాలనకు ఏడాది నిండిన సందర్భంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరిట రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేశ్ ప్రసందించారు. అందరూ కూటమి గెలిచింది, టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది, బీజేపీ గెలిచింది అంటున్నారు... గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు అని స్పష్టం చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్.. 175కి 164 స్థానాలులతో ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు... చరిత్రను తిరగరాశారు... ఇది ప్రజా విజయం అని లోకేశ్ అన్నారు.

చేయాల్సింది చాలా ఉంది!

వాళ్లు ఐదేళ్లలో సాధించలేనిది మనం ఏడాదిలో సాధించాం. అన్ని సమస్యలు పరిష్కరించేసాం అని నేను చెప్పడం లేదు. ఇంకా చెయ్యాల్సింది ఎంతో ఉంది.  గత ప్రభుత్వానికి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది.  మన చంద్రన్న కేవలం ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. దేశంలో ఏ రాష్ట్రము 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్ కే పరిమితం అయితే 15 వేలు ఇస్తున్నాం. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసాం.  8745 కోట్లు తల్లుల ఖాతాల్లో వేసాం. మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే  విద్యార్థులకు త్వరలోనే పథకాన్ని అమలు చేస్తాం. 

అరాచకపాలనపై తిరుగుబాటు... ప్రజలకు స్వేచ్ఛ

ఐదేళ్లు అరాచక పాలన సాగింది. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు.  విధ్వంస పాలన పై ప్రజలు తిరగబడి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. 
సుపరిపాలనలో మనం తొలి అడుగు వేసాం. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు ప్రజా ప్రభుత్వం ఏడాదిలో ఏం సాధించింది అని అడుగుతున్నారు. నేను వారికి సూటిగా సమాధానం చెప్పాలి అనుకుంటున్నా. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల మొఖంలో చిరునవ్వు వచ్చింది.  ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చింది.  నియంత పాలన నుండి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది. 

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్

గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లు మూసేసారు. ప్రజా ప్రభుత్వం 203 అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించింది. దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేశాం. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు.  ప్రజా ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తాం. గత పాలకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దానిని మన ప్రజా ప్రభుత్వం రద్దు చేసింది.  గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే మన ప్రజా ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తేసింది. 

పేదరికంలేని సమాజం బాబు లక్ష్యం

పేదరికం లేని సమాజం చూడాలనేది చంద్రబాబు గారి లక్ష్యం.  పీ4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే పీ4. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్న మార్గదర్శులకు నా ధన్యవాదాలు. పవనన్న ఆధ్వర్యంలో పంచాయతీలకు స్వాతంత్య్రం వచ్చింది. పంచాయితీలకు వెయ్యి కోట్లు నిధులు విడుదల చేసాం.  రైతుల నుండి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం, 13,600 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన 1700 కోట్ల బకాయిలు కూడా మనమే తీర్చాము.  పొగాకు, మిర్చి, కోకో రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుంది ప్రజా ప్రభుత్వం. 

డబుల్ ఇంజన్ సర్కార్ పవర్!

డబుల్ ఇంజిన్ సర్కార్ మన పవర్. ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. గత ప్రభుత్వం నాశనం చేయాలనుకున్న అమరావతిని డబుల్ స్పీడ్ తో పట్టాలెక్కించాం, 60వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. రాజధానికి 15వేల కోట్లు, పోలవరానికి 12వేల కోట్లు ఇచ్చారు ఏడాదిలోనే పోలవరం పనులు  8శాతం పూర్తి చేశాం, విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్లు సాయం అందించారు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ ల అభివృద్ధికి  5వేలకోట్లు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సహకరించారు. కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు కు సహకరిస్తున్నారు. ఐదేళ్ల లో గత ప్రభుత్వం సాధించలేనివి ప్రజా ప్రభుత్వం ఏడాదిలో సాధించింది.  డబుల్ ఇంజన్ సర్కారు వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

విద్యాశాఖలో సంస్కరణలు

విద్యా శాఖ మంత్రిని నా శాఖ లో సంస్కరణలు తెస్తున్నా. రాజకీయాలకు అతీతంగా విద్య వ్యవస్థ ఉండాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యం. గత పాలనలో ఫోటోలు రంగుల పిచ్చి మీరంతా చూసారు. యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, ఫోటోలు. ఫీజు రీయింబర్స్మెంట్ నుండి చిక్కీల వరకూ 6500 కోట్ల బకాయిలు నా నెత్తి మీద పోయారు. బకాయిలన్నీ  క్రమ పద్దతిలో చెల్లిస్తున్నాం. మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టాం. గత ప్రభుత్వ పాలనలో 1200 స్కూళ్లు వన్ క్లాస్ ... వన్ టీచర్ ఉంటే ఇప్పుడు 9800 స్కూల్స్ లో  వన్ క్లాస్... వన్ టీచర్ పెంచాం. 

ఉద్యోగస్తులకు హ్యాట్సాఫ్!

ఉద్యోగస్తులు ప్రభుత్వానికి గుండెకాయ.  సీఎస్ గారి దగ్గర నుండి క్షేత్ర స్థాయిలో పనిచేసే చిన్న ఉద్యోగి వరకూ గత ఏడాది కాలం కష్టపడి పనిచేసారు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ హ్యాట్సాఫ్. ముఖ్యంగా నా టీచర్లు పూర్తి స్థాయిలో నాకు సహకారం అందించారు.  గత ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎలా అవమానించారో అందరూ చూసాం. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు క్యూ లైన్ కంట్రోల్ చెయ్యమని నిలబెట్టారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.  అనేక హామీలు ఇచ్చి ఉద్యోగస్తులను గత ప్రభుత్వం మోసం చేసింది.  ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. 

ప్రజలకు చేరువగా ఉండండి!

దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు. అవకాశం ఉన్నంత వరకూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలు చెల్లిస్తున్నాం. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం ఎంతో అవసరం. నేను 65 ప్రజా దర్బార్లు నిర్వహించాను. ప్రతి రోజు ప్రజల్ని కలుస్తున్నాను. ఆ ఫైల్స్ అన్ని మంత్రులకు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను.  ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి.  అనేక సమస్యలతో వారు మీ దగ్గరకు వస్తారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి.  ఉద్యోగస్తులు తలుచుకుంటే స్వర్ణాంధ్ర ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత పాలకుల అహంకారం, అరాచకంతో  151 - 11 అయ్యింది. కాలర్ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మంత్రి లోకేశ్ అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
Free Bus Travel
Pension Scheme
Education Reforms
Double Engine Sarkar
YSRCP
Jagan Mohan Reddy

More Telugu News