India-Pakistan ceasefire: పాక్‌తో కాల్పుల విరమణ షరతులతో కూడినదే... సింధు జలాలపై వెనక్కి తగ్గని భారత్!

Conditional Ceasefire Between India and Pakistan
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా షరతులతో కూడుకున్నదని, ఉగ్రవాదంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సింధు జలాల ఒప్పందం నిలిపివేత సహా పొరుగుదేశంపై తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలు కొనసాగుతాయని తేల్చిచెప్పాయి. కాల్పుల విరమణ కోసం పాకిస్థానే చర్చలు ప్రారంభించిందని ఈ వర్గాలు తెలిపాయి.

శనివారం కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీపడదని, ఈ వైఖరి మారదని స్పష్టం చేశారు. 

ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య జరిగిన చర్చల అనంతరమే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని ప్రకటించినప్పటికీ, పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని మిస్రీ వివరించారు.

పహల్గామ్‌లో 26 మంది మృతి చెందిన ఉగ్రదాడి తర్వాత భారత్ పలు దౌత్యపరమైన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇది కొనసాగుతుందని, ప్రస్తుత కాల్పుల విరమణ కేవలం సైనిక చర్యలకు మాత్రమే పరిమితమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆరు దశాబ్దాల నాటి ఈ ఒప్పందం ద్వారా సింధూ నదీ వ్యవస్థలోని జలాల పంపకం జరుగుతోంది. సట్లెజ్, బియాస్, రావి నదుల నుంచి సుమారు 33 మిలియన్ ఎకరాల అడుగుల (ఎంఏఎఫ్) నీటిని భారత్ నిరంతరాయంగా వినియోగించుకోవడానికి, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నుంచి సుమారు 135 ఎంఏఎఫ్ నీటిని పాకిస్థాన్ వాడుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పించింది.

భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా, కశ్మీర్‌లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాలను పెంచడం ప్రారంభించింది. దీనివల్ల పాకిస్థాన్‌కు నీటి ప్రవాహం తగ్గింది. ఈ ప్రాంతంలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా కేంద్రం వేగవంతం చేయనుంది. ఈ ఒప్పందం రద్దు పాకిస్థాన్‌ను తీవ్రంగా కలవరపరిచింది. దీనిని 'యుద్ధ చర్య'గా అభివర్ణించింది.

కాల్పుల విరమణ కేవలం సైనిక అంశానికే పరిమితమని, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తాజాగా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఒప్పందం స్ఫూర్తికి పాకిస్థాన్ పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని, 65 ఏళ్లుగా దాడులు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నప్పటికీ భారత్ సహనంతో ఒప్పందానికి కట్టుబడి ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం కూడా వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
India-Pakistan ceasefire
Indo-Pak relations
SIndhu water treaty
Vikram Misri
S Jaishankar
Pakistan terrorism

More Telugu News