ముందు మీ చరిత్రేంటో చూసుకోండి... అఖిలేశ్ యాదవ్ కు సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్

Yogi Adityanath counters Akhilesh Yadav and tells him to check his history first
  • అయోధ్యను అద్వితీయ పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతామన్న అఖిలేశ్ యాదవ్
  • తీవ్రంగా స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • రామభక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర మీదేనంటూ గత ఎస్పీ ప్రభుత్వంపై విమర్శలు
  • శ్మశానాల గోడలకు బదులు ఆలయాలకు నిధులు కేటాయిస్తున్నామని వ్యాఖ్య
  • అయోధ్యతో పాటు మధుర, శ్రీకృష్ణ జన్మభూమిపైనా మాట్లాడాలని సవాల్
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ అయోధ్యపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామభక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న ఎస్పీ, అయోధ్యను పవిత్ర నగరంగా ఎలా తీర్చిదిద్దుతుందని ఆయన ప్రశ్నించారు. హిందూ మత సంప్రదాయాలను వ్యతిరేకించడమే ఎస్పీ నైజమని, ఆ పార్టీకి ఆలయ నగరి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని యోగి ఆరోపించారు.

అయోధ్య విరాళాల్లో అవినీతిపై స్పందిస్తూ, తాము అధికారంలోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అసలైన ఆధ్యాత్మికతను అనుభవించేలా అయోధ్యను అద్వితీయమైన, సాటిలేని పవిత్ర నగరంగా అభివృద్ధి చేస్తామని అఖిలేశ్ యాదవ్ శనివారం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, హత్రాస్‌లో రూ.548 కోట్ల విలువైన 143 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం యోగి మాట్లాడుతూ అఖిలేశ్ పై విమర్శలు గుప్పించారు. "నిన్న అఖిలేశ్ యాదవ్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ప్రభుత్వం వస్తే అయోధ్యను పవిత్ర నగరంగా చేస్తారట. మీరు ఏం పవిత్ర నగరం కడతారు? ముందు మీ చరిత్ర చూసుకోండి. రామభక్తులపై కాల్పులు జరిపించింది మీరే కదా?" అని యోగి నిలదీశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రామభక్తుల కృషి ఫలితంగా అయోధ్య నేడు తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని 'త్రేతాయుగాన్ని' గుర్తుచేస్తోందని యోగి అన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఇప్పుడు మీకు కూడా ఆశ కలుగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లు, జైళ్లలో కృష్ణాష్టమి వేడుకలను నిలిపివేసిందని, కన్వర్‌ యాత్రపై ఆంక్షలు విధించిందని యోగి ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయని యోగి తెలిపారు. "ఈ రోజు హత్రాస్‌లో 22కు పైగా ఆలయాలను సుందరీకరించామని మా ప్రతినిధులు చెబుతున్నారు. ఇది ఎస్పీ హయాంలో సాధ్యమయ్యేదా? అప్పుడు ఈ డబ్బు శ్మశాన వాటికల గోడల నిర్మాణానికి వెళ్లేది. మేము ఆ డబ్బును ఆలయాల అభివృద్ధి వైపు మళ్లించాం" అని ఆయన స్పష్టం చేశారు.

అయోధ్యలో మార్పులను స్వయంగా చూసి తెలుసుకోవాలని, ఒక్కసారైనా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ప్రతిపక్ష నేతలకు ఆయన సూచించారు. కేవలం అయోధ్యే కాకుండా, మధుర, బృందావనంపైనా అఖిలేశ్ తన వైఖరి స్పష్టం చేయాలని యోగి సవాల్ విసిరారు. "మీకు నిజంగా ఆధ్యాత్మికతపై నమ్మకం ఉంటే, మధుర, బృందావనం, శ్రీకృష్ణ జన్మభూమి గురించి బహిరంగంగా మాట్లాడండి. శ్రీకృష్ణుడి జన్మస్థలాన్ని కూడా గౌరవించాలి" అని అన్నారు.

ముల్లాల, మౌల్వీల ముందు మోకరిల్లడం తప్ప సమాజ్‌వాదీ పార్టీకి మరో అభివృద్ధి ఎజెండా లేదని, అభివృద్ధిపై దుమ్ము చల్లే ప్రయత్నం చేయవద్దని యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య, మధుర, కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన వివరించారు.
Yogi Adityanath
Akhilesh Yadav
Ayodhya development
Samajwadi Party
Uttar Pradesh politics
Ram Mandir

More Telugu News