టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్.. టెస్టులకు కోహ్లీ గుడ్‌బై?
- ఇటీవలే టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై
- రిటైర్మెంట్ ఆలోచనను బీసీసీఐకి చెప్పిన కోహ్లీ!
- జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు ముందే కోహ్లీ నిర్ణయం వెలువడే అవకాశం
- ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడుతున్న కోహ్లీ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తన టెస్ట్ రిటైర్మెంట్ ఆలోచనల గురించి విరాట్ కోహ్లీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్తలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత జట్టు జూన్ నెల నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందే విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ భవితవ్యంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు టెస్టుల నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటే భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.