"మిస్టర్ డ్రామారావు" అంటూ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas Reddy slams KTR as Mr Drama Rao
  • పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపణ
  • పదేళ్లలో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని విమర్శ
  • అధికార లాంఛనాలతో గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం 'ఎక్స్' వేదికగా ఘాటు విమర్శలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయన్ని విస్మరించి, ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయం చేస్తున్న 'మిస్టర్ డ్రామారావు' కేటీఆర్ అంటూ పొంగులేటి మండిపడ్డారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిందని పొంగులేటి ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనకు కనీసం రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సంతోష్ రావు, దామోదర్ రావు వంటి వారికి పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం, పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు విస్మరించిందని ఆయన ప్రశ్నించారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డిని వైద్య చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిందని, ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. ఉద్యమకారులను కేవలం ఓట్ల కోసం వాడుకుని, అధికారం, కీలక పదవులన్నీ కల్వకుంట్ల కుటుంబమే అనుభవించడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని పొంగులేటి ధ్వజమెత్తారు.
Advertisement
Ponguleti Srinivas Reddy
KTR
BRS Party
Peddi Sudarshan Reddy
Telangana Politics
Congress

More Telugu News