పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో అది అత్యంత బాధాకరం: కేటీఆర్

KTR sensational allegations that Revanth government pressure led to Peddi Sudarshan Reddy death
  • సుదర్శన్ రెడ్డి ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడేవారన్న కేటీఆర్
  • విద్యాశాఖలోని బెడ్స్ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారని వెల్లడి
  • అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని మండిపాటు

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలు నిజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్ రెడ్డి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరినీ వదలకుండా వేధింపులకు, టార్చర్‌కు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


పెద్ది సుదర్శన్ రెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేవారని, ప్రభుత్వంలోని అక్రమాలను నిరంతరం బయటపెట్టేవారని కేటీఆర్ గుర్తుచేశారు. సివిల్ సప్లైస్ స్కామ్‌తో పాటు విద్యాశాఖలోని బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారని చెప్పారు. ఆ ఆధారాలను ఈడీ కార్యాలయానికి అందజేయడమే కాకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. అయితే, సుదర్శన్ రెడ్డి మరణించిన మరునాడే సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అవుతూ గైడెన్స్ రావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తులు ఆయన విమర్శలను తట్టుకోలేక, అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని ఆరోపించారు.


బీసీ రిజర్వేషన్లను ప్రధాని మోదీ నిలిపివేసారని సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని, ఆయన చేసిన తీర్మానం కేవలం ఒక చిత్తు కాగితమని కొట్టిపారేశారు. సోనియా గాంధీ తెచ్చిన విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారా అని ప్రశ్నించారు. గురుకులాల్లో 150 మంది విద్యార్థులు చనిపోవడం, 7 వేల ఐటీ ఉద్యోగాలు పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

గోదావరిలో నీళ్లు సముద్రం పాలు అవుతున్నా రైతాంగానికి నీళ్లందించకుండా ఎండబెడుతున్నారని మండిపడ్డారు. పంపింగ్ ద్వారా నీళ్లు మిడ్ మానేరుకు ఎలా వస్తున్నాయో తెలియని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హెలికాప్టర్లలో వెళ్లి పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్ చేయడం వెనుక రూ.200 కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు వేసిన స్కెచ్ ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు సాగుతున్నాయని అన్నారు.

Advertisement
KTR
Peddi Sudarshan Reddy
Revanth Reddy
Telangana Congress
BRS Party
Narsampet MLA

More Telugu News