Advertisement

ఆర్టీజీఎస్ ప‌నితీరు ఆద‌ర్శ‌నీయం: బోట్సువానా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అర్బ‌న్ బ‌సిమా ద‌బుత‌

botswana govt advisor lauds rtgs as exemplary
  • బోట్సువానా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అర్బ‌న్ బ‌సిమా ద‌బుత‌
  • ఏపీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బోట్సువానా ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుత
  • తమ దేశంలోనూ ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌న్న బ‌సిమా ద‌బుత‌
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీజీఎస్ పనితీరు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బోట్సువానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బోట్సువానా దేశ ప్ర‌భుత్వ సలహాదారు అర్బన్ బ‌సిమా ద‌బుత శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి కె. దినేష్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి, ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందని, అటు ప్రభుత్వానికి, ఇటు పౌరులకు మధ్య ఈ సంస్థ ఒక వార‌ధిగా ప‌నిచేస్తుంద‌న్నారు. ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం చేసి ఒక డేటా లేక్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ సేవలను మరింత స‌ర‌ళ‌త‌రం చేయడంలో ఈ సంస్థ దోహ‌ద‌ప‌డుతోంద‌ని ఆయన వివరించారు. 

డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, డ్రోన్స్ తదితర సాంకేతిక స‌దుపాయ‌ల‌న్నీ ఉపయోగించుకోవడానికి ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఒకేచోట అన్ని సేవలు సులభంగా పొందేలా ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు వాట్సప్ గవర్నెన్స్‌ను అందిస్తోందని చెప్పారు. ఇందులో ప్రస్తుతం 161 సేవలు అందిస్తున్నామని, తదుపరి అన్ని రకాల సేవలు ఇందులోనే పౌరులు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
బోట్సువానా ప్రభుత్వ సలహాదారు బసిమా ద‌బుత మాట్లాడుతూ ఆర్టీజీఎస్ పనితీరు గురించి విని తాము ఈ కేంద్రాన్ని సందర్శించి స్వయంగా దీని పని తీరు తెలుసుకోవాలని వచ్చామని చెప్పారు. ఈ సంస్థ పనితీరు అద్భుతంగా, ఆదర్శనీయంగా ఉందని చెప్పారు. తమ దేశంలో కూడా పౌరులకు మెరుగైన సేవలందించేలా ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ మాధురి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
botswana govt advisor
RTGS
Amaravati
ap govt

More Telugu News