విశాఖ బీచ్‌లో మిక్చర్ రుచి చూసిన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

విశాఖ బీచ్‌లో మిక్చర్ రుచి చూసిన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

Chandrababu tastes masala mixture at Vizag beach and grants pension to lone woman on the spot
  • విశాఖ ఆర్‌కే బీచ్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించే మత్స్యకారులకు ప్రోత్సాహకాలు అందజేత
  • మ్యాన్‌హోళ్లు శుభ్రం చేసే ఆధునిక రోబో పనితీరును పరిశీలించిన ముఖ్యమంత్రి
  • మురి మిక్చర్ విక్రయించే ఒంటరి మహిళకు పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశం
ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమానికి వెళ్లినా, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంలో చంద్రబాబు తనదైన శైలిని ప్రదర్శించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో పర్యటన సందర్భంగా సాగర తీరంలో ఓ సాధారణ మహిళ విక్రయిస్తున్న మురి మిక్చర్ (మసాలా మిక్చర్) రుచి చూశారు. ఆ తర్వాత ఆమె జీవనోపాధి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. తాను ఒంటరి మహిళనని, ఈ వ్యాపారమే జీవనాధారమని ఆమె చెప్పడంతో సీఎం తక్షణమే స్పందించారు. ఆమెకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అంతకుముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్‌లో జీవీఎంసీ చేపట్టిన ‘సాగర స్వచ్ఛత’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదజాలరిపేటలో ఏర్పాటు చేసిన ‘ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్’ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.

పర్యటనలో భాగంగా సముద్రంలో వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా తమకు ప్రోత్సాహకాల రూపంలో అదనపు ఆదాయం వస్తోందని మత్స్యకారులు సీఎంకు వివరించారు. సేకరించిన వ్యర్థాలను డిజిటల్ పద్ధతిలో తూకం వేయడాన్ని చంద్రబాబు పరిశీలించి, మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందజేశారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్, పాత వలలను ఎలా తొలగిస్తున్నారో స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్నారు. సాగర స్వచ్ఛతలో భాగంగా మొత్తం 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు సీఎంకు వివరించారు.

అనంతరం మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో పరిశీలించారు. జీవీఎంసీ చేపట్టిన సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, భవిష్యత్ కార్యాచరణపై బ్లూమ్‌బెర్గ్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. మొత్తంగా ఈ పర్యటనలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే, సామాన్య ప్రజల సమస్యలపై సీఎం చూపిన శ్రద్ధ ప్రత్యేకంగా నిలిచింది.
Advertisement
Chandrababu Naidu
Visakhapatnam RK Beach
Sagara Swachhata
AP CM Pension
Ocean Plastic Recovery Center
Swarnandhra Swachhandhra

More Telugu News