కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అక్కడే ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
- తొలగించకుండానే ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని పోలీసులకు ఆదేశం
- సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి
- స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
- సీపీఆర్వో అయోధ్య రెడ్డి ట్వీట్
ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందనే కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా పాప్యులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ.. అదే పాప్యులారిటీ కారణంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, కుమారి ఆంటీకి మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. స్వయం ఉపాధి పొందుతున్న పేదలకు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకే ప్రయత్నిస్తాం తప్ప వారి ఉపాధిని దెబ్బతీసే పనులు తమ ప్రభుత్వం చేయదన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎప్పటిలాగే అదే చోట కొనసాగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.