‘జరగని పెళ్లికి టికెట్లు’.. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సియా గోయల్ చాట్ కలకలం!

Tickets for a wedding that wont happen Siya Goyal chat sensation in Ketan Agarwal murder case
  • నిందితురాలి స్నాప్‌చాట్ సంభాషణ గుర్తింపు
  • పెళ్లి జరగదంటూ ముందే సంకేతాలు
  • అనుమానాలు రాకుండా విమాన టికెట్ బుకింగ్‌లు
  • కోడ్ భాష ఆధారాల కోసం పోలీసుల దర్యాప్తు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26)ను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ ఘాతుకానికి దాదాపు మూడు వారాల ముందే, అంటే మే 25న ప్రధాన నిందితురాలు సియా గోయల్ (20) తన స్నేహితురాలితో జరిపినట్లుగా చెబుతున్న స్నాప్‌చాట్ సంభాషణ ఇప్పుడు బయటపడి ఈ దర్యాప్తును మలుపు తిప్పింది.

వివాహ వేడుకకు విమాన టికెట్లు బుక్ చేయాలనే నెపంతో సియా తన స్నేహితురాలిని గుర్తింపు కార్డు వివరాలు అడిగింది. "టికెట్ల బుకింగ్ కోసమే.. ఎలాగూ ఆ పెళ్లి జరగదు, అయినా సరే వివరాలు పంపించు" అంటూ సియా హిందీలో పంపిన సందేశం ఇప్పుడు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సిన ఈ విలాసవంతమైన వివాహం కోసం అప్పటికే రెండు ప్రత్యేక విమానాలను కూడా బుక్ చేశారు. అయితే జూన్ 18న కేతన్ అనుమానాస్పద స్థితిలో లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి పడి మృతి చెందడంతో ఈ వివాహం కాస్తా ఘోర విషాదంగా మారింది.

    
అయితే, పోలీసుల దృష్టిని మళ్లించేందుకు, తానేదో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నమ్మించేందుకే సియా ఈ విమాన టికెట్ల డ్రామా ఆడిందా అనే కోణంలో పోలీసులు డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ కుట్ర గురించి సదరు స్నేహితురాలికి ముందే తెలుసా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ, కేతన్‌ను చంపే ప్లాన్ గురించి తెలిసిన సియా ప్రియుడు చేతన్ చౌదరి (22) క్లాస్‌మేట్ అయిన మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

మరోవైపు, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారిని జైలుకు తరలించారు. నిందితులిద్దరూ తమ అంతర్గత సంభాషణల్లో 'కోడ్ వర్డ్స్' ఉపయోగించారని, మొబైల్ డేటా ఇటీవలే రికవరీ అయినందున వారిని ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాల్సి ఉందని, పోలీస్ కస్టడీ పొడిగించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సియాకు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Siya Goyal
Ketan Agarwal
Pune businessman murder case
Chetan Chaudhary
Snapchat chat evidence
Lohagad Fort murder

More Telugu News