బ్రిటీష్ వాళ్లకన్నా దారుణంగా పాలిస్తున్నారు.. జగన్ పై లోకేశ్ ఫైర్
- క్విట్ సైకో జగన్.. సేవ్ ఏపీ అంటూ నినదించిన యువనేత
- పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడంటూ ట్వీట్
- జూలకల్లులో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
యువగళం పాదయాత్రలో భాగంగా 178 వ రోజు జూలకల్లు నుంచి నారా లోకేశ్ యాత్ర ప్రారంభించారు. దారిపొడవునా అక్కాచెల్లెమ్మలు తనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారని, హారతులతో అభిమానం చాటుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జూలకల్లు గ్రామస్థులు నారా లోకేశ్ కు వినతిపత్రం అందించారు. నిర్వహణలోపంతో నాగార్జున సాగర్ కుడికాలువ గేట్లు శిథిలావస్థకు చేరిన వైనాన్ని సెల్ఫీ చాలెంజ్ ద్వారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను కలిసిన జూలకల్లు, పిడుగురాళ్ల, గురజాల ప్రజలకు లోకేశ్ ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు.