Advertisement

'ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu launches AP Astram and directs future policing in Andhra Pradesh
  • విజయవాడలో 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన సీఎం
  • ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం
  • ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలని సూచన
  • పోలీసులకు ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశం
  • రతన్ టాటా హబ్, విట్ యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్' కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా, పోలీసు వ్యవస్థ నిర్మాణాన్నే పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

భవిష్యత్ పోలీసింగ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లిటరసీ ఆధారంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 2001లోనే తాను ఫ్యూచర్ పోలీసింగ్ వర్క్‌షాప్ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అప్పటితో పోలిస్తే నేడు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయన్నారు. వీటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పోలీసు వ్యవస్థ పెంపొందించుకోవాలని సూచించారు. 

పోలీసుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వారి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల అనుభవాన్ని గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయి-డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాల నియంత్రణ, కన్విక్షన్ రేటు పెంపు వంటి అంశాల్లో ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. 

ప్రతి పోలీసు సిబ్బందికి డిజిటల్ లిటరసీ తప్పనిసరి అని, పోలీసు ఉన్నతాధికారులు కూడా నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. నేరం చేసిన వారికి వేగంగా శిక్షలు పడేలా దర్యాప్తు వ్యవస్థ పనిచేస్తేనే నేరస్థుల్లో భయం పుడుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు ప్రణాళికలు, సమర్థవంతమైన దర్యాప్తు కీలకమన్నారు.

ఈ సందర్భంగా ఏపీ పోలీస్ వెబ్‌సైట్, ధర్మ యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. రోడ్ సేఫ్టీ, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సహా 8 అంశాలపై ఏపీ పోలీసులు.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, విట్ యూనివర్సిటీలతో ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నారు. ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, హోం సెక్రటరీ కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ అధికారులు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
AP Astram App
Andhra Pradesh Police
Future Policing
AI in Law Enforcement
AP Police Retreat 2026

More Telugu News