Advertisement

బంధువుల మెప్పు కోసం రూ.20 లక్షల పెళ్లి హంగామా దేనికి?.. సీఏ పోస్టుతో నెట్‌లో రచ్చ

Meenal Goyal questions spending 20 lakh on weddings for relatives and triggers debate
  • భారీ పెళ్లిళ్లపై బెంగళూరు సీఏ మీనల్ గోయల్ ఆందోళన
  • రూ.20 లక్షల బడ్జెట్ లెక్కలు వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
  • ఆర్భాటాల కంటే భవిష్యత్ ఆర్థిక భద్రతే ముఖ్యమని సలహా
  • మీనల్ అభిప్రాయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
  • 'లైఫ్ టైమ్ మెమరీస్' వర్సెస్ 'మిడిల్ క్లాస్ మైండ్ సెట్'పై చర్చ
రంగురంగుల లైట్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే డెకరేషన్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బంధువుల సందడి.. సాధారణంగా ఏ భారతీయ వివాహంలోనైనా కనిపించే హంగామా ఇది! అయితే, కేవలం కొన్ని గంటల వైభవం కోసం లక్షలాది రూపాయల కష్టార్జితాన్ని ఖర్చు చేయడం సరైనదేనా? ఇదే అంశంపై బెంగళూరుకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది!

"బంధువులను మెప్పించడం కోసం రూ.20 లక్షలు ఖర్చు చేయకండి" అంటూ మీనల్ గోయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక రూ.20 లక్షల పెళ్లి బడ్జెట్ లెక్కలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఆహారానికి రూ.6 లక్షలు, వెన్యూకి రూ.5 లక్షలు, డెకరేషన్‌కు రూ.3 లక్షలు, ఫొటోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెరో రూ.2 లక్షలు.. ఇలా కరిగిపోయే ఈ డబ్బు వల్ల మిగిలేది ఏంటని ప్రశ్నించారు. "పెళ్లి జరిగిన 48 గంటల్లోనే హాలు ఖాళీ అవుతుంది, ఆహారం పూర్తవుతుంది, అలంకరణలు తొలగిపోతాయి.. వచ్చిన అతిథులు తర్వాతి పెళ్లికి వెళ్లిపోతారు! కానీ, మిగిలేది మాత్రం ఆ కుటుంబంపై పడే తీవ్ర ఆర్థిక భారమే" అని ఆమె కుండబద్దలు కొట్టారు.

ఆర్భాటంగా ఖర్చు చేసే బదులు ఆ మొత్తాన్ని సొంతింటి డౌన్ పేమెంట్, ఎమర్జెన్సీ ఫండ్, పిల్లల చదువులు లేదా భవిష్యత్ పెట్టుబడులకు ఉపయోగిస్తే ఆర్థిక ప్రశాంతత లభిస్తుందని మీనల్ సూచించారు. "వివాహం అనేది ఒక వేడుక మాత్రమే, అది ఆర్థిక భారంగా మారకూడదు. కేవలం ఒక రోజు పెళ్లి వేడుకను మాత్రమే కాదు, జీవితాంతం నిలిచే వివాహ బంధాన్ని దృఢంగా నిర్మించుకోండి" అని హితవు పలికారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక కాబట్టి నచ్చినంత ఖర్చు చేయడంలో తప్పులేదని, రూ.20 లక్షలైనా సంతోషాన్ని, తీపి గుర్తుల్ని కొనలేవని కొందరు సమర్థిస్తుంటే.. మధ్యతరగతి కుటుంబాలను అప్పులపాలు చేసే ఇటువంటి ఆర్భాటాలకు స్వస్తి పలికి, సరళమైన పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.
Advertisement
Meenal Goyal
Indian wedding expenses
Wedding budget breakdown
Financial planning for marriage
Viral social media post
Expensive weddings vs savings

More Telugu News