పీజీ డాక్టర్ ప్రీతి పరిస్థితి విషమం

Warangal PG doctor Preethi Health Condition is Serious and Treatment Continue in NIMS
  • హై డోస్ మత్తుమందు వల్ల దెబ్బతిన్న అవయవాలు
  • ఇప్పుడే ఏమీ చెప్పలేమని నిమ్స్ వైద్యుల వెల్లడి
  • ఐదుగురు డాక్టర్ల బృందంతో ప్రీతికి చికిత్స
  • ఆమె శరీరం స్పందించడంలేదంటున్న వైద్యులు
వరంగల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పీజీ డాక్టర్ ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ప్రీతికి వైద్యం అందించేందుకు ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజ నేతృత్వంలో ఈ బృందం తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు. అయితే, చికిత్సకు ప్రీతి శరీరం స్పందించడంలేదని వైద్యులు తెలిపారు. బీపీ, పల్స్ రేట్ నమోదు కాని పరిస్థితి ఉందని చెప్పారు.

వరంగల్ నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలిస్తుండగా రెండుసార్లు ప్రీతి గుండె ఆగిపోయిందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు సీపీఆర్ చేసి గుండె మళ్లీ కొట్టుకునేలా చేశారన్నారు. ఇంజక్షన్ ద్వారా మత్తుమందు హై డోస్ లో తీసుకోవడం వల్ల ప్రీతి శరీరంలో డ్యామేజీ తీవ్రంగా ఉందన్నారు. అంతర్గతంగా అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, మెదడుపైనా మత్తుమందు ప్రభావం ఎక్కువగా ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రీతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

కాగా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో వేధింపులు తాళలేక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం నాడు మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. వరంగల్ కేఎంసీ లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. ప్రీతిపై వేధింపులకు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై డీఎంఈ రమేశ్ రెడ్డి గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ సాధారణమేనని రమేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Go Back to Shorts
dr.preethi
kmc
mgm
doctor suicide
nims
critical

More Telugu News