బార్లలో విక్రయించే మద్యం ధర కూడా పెంచుతాం: ఏపీ మంత్రి నారాయణస్వామి
- మద్యం పాలసీపై సీఎం జగన్ సమీక్ష
- సమీక్షకు హాజరైన మంత్రి నారాయణస్వామి
- బార్ పాలసీ అతిక్రమిస్తే కఠిన శిక్షలుంటాయని వెల్లడి
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు పనిచేయాలని సీఎం ఆదేశించినట్టు నారాయణస్వామి వెల్లడించారు. బార్ పాలసీని అతిక్రమించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా, బార్లను రద్దు చేసి కొత్తగా లాటరీ పద్ధతిన మంజూరు చేసే ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. మద్యం కల్తీ చేస్తే కఠిన శిక్షలు పడేలా చట్టం తెస్తామని చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయని, లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, 6 నెలలు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని వివరించారు. ఇక, ఇదే సందర్భంలో విపక్ష టీడీపీపైనా మంత్రి విమర్శలు చేశారు. మద్యపాన నిషేధానికి టీడీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ప్రశ్నించారు. తమ వైఖరేంటో చెప్పకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.