మలయాళం నుంచి ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వస్తుందంటే, ఆడియన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాంటి ప్రేక్షకులలో మరింత కుతూహలాన్ని రేకెత్తించిన సినిమా 'ఉయిర్'. జూన్ 26వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. రోషన్ మాథ్యూ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, పద్మకుమార్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు (ఆగస్టు 4) నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
'కన్నూర్' జిల్లా పరిధిలోని 'ధర్మడం' పోలీస్ స్టేషన్ కి ప్రొబేషనరీ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా అజీబ్ ( రోషన్ మాథ్యూ) బాధ్యతలు చేపడతాడు. అతని పైఅధికారిగా 'నందకుమార్' ఉండగా,సహచరులుగా 'జాయ్'.. మోహన్ .. మధు ఉంటారు. అక్కడికి సమీపంలోని 'కొడువల్లి' విలేజ్ లో ఒక బావిలో స్త్రీ డెడ్ బాడీ ఉందనే సమాచారం అందుతుంది. దాంతో అజీబ్ బృందం అక్కడికి చేరుకుంటుంది. పాడుబడిన బావిలో నుంచి ఆ డెడ్ బాడీని బయటికి తీయిస్తారు. ఆమె చనిపోయి కొన్ని రోజులు అయ్యుంటుందని భావిస్తారు.
ఆ యువతి పేరు 'శోభ' అనీ, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారని అజీబ్ తెలుసుకుంటాడు. ఆమె చేతిపై 'రాజు' అనే పచ్చబొట్టు ఉంటుంది. అది ఆమె భర్త పేరు అనే విషయం కూడా అజీబ్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఆ ఇంట్లో వాళ్లకి శోభ ఫ్యామిలీ ఫొటో దొరుకుతుంది. ఆ ఫొటో ఆధారంగా వాళ్లు రాజును గుర్తుపడతారు. అతని కోసం గాలించి పట్టుకుంటారు. తన భార్య తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ, అది భరించలేక తాను పిల్లలను తీసుకుని వెళ్లిపోయానని 'రాజు' చెబుతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది తనకి తెలియదని అంటాడు.
శోభతో కొంతకాలంగా తనకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో రాజు తేల్చి చెబుతాడు. శవాన్ని తీసుకు వెళ్లనని అతను చెప్పడంతో, పంపించివేస్తారు. ఆత్మహత్యగా భావించి శోభ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఆ తరువాత శోభ బంధువులు కొందరు స్టేషన్ కి వస్తారు. రాజుతో చెప్పిన తరువాతనే శోభ అంత్యక్రియలు పూర్తి చేశామని అజీబ్ వాళ్లతో చెబుతాడు. ఆ సమయంలో ఆ ఫొటో చూసినవాళ్లు, ఆ ఫొటోలో ఉన్నది రాజు కాదనీ .. అతని పేరు 'భువనేశ్' అని చెబుతారు. అతను ఆమె భర్త కాదని అంటారు.
రాజు పేరుతో భువనేశ్ తమని తప్పుదారి పట్టించాడనే విషయం అజీబ్ కి అర్థమవుతుంది. ఇది ఆత్మహత్య కాదు .. హత్య అనే విషయం స్పష్టమవుతుంది. భువనేశ్ ఎక్కడ ఉన్నా 24 గంటలలో పట్టుకోవాలని పైఅధికారులు అజీబ్ ను ఆదేశిస్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? భువనేశ్ ను అతను పట్టుకోగలుగుతాడా? శోభ మరణానికి భువనేశ్ కారకుడా ? ఆమె భర్త - పిల్లలు ఏమయ్యారు? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ సాగే కథ ఇది.
పోలీస్ అధికారులకు తమ కెరియర్లో కొన్ని చిత్రమైన కేసులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఒక పోలీస్ ఆఫీసర్ కి తన కెరియర్లో ఎదురైన కేసు ఇది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అందువలన దర్శకుడు సహజత్వానికి దగ్గరగా ఈ సినిమాను నడిపించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. పాడుబడిన ఒక బావిలో నుంచి ఒక మహిళ శవం బయటపడుతుంది. ఆమె ఎవరు? ఎలా చనిపోయింది? అనే ఇన్వెస్టిగేషన్ తో ఈ కథ మొదలవుతుంది.
కొన్ని కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతుంటాయి. జరిగింది హత్యనా? ఆత్మహత్యనా? అనేది కొన్ని సందర్భాలలో వాళ్లు తేల్చుకోలేని పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. అలా ఆత్మహత్య అనుకుని ఒక బాడీకి అంత్య క్రియలు జరిపించిన తరువాత, అది హత్య అని తెలిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఎలాంటి అవాంతరాలను దాటుకుంటూ వెళతాడు? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను పరిగెత్తించిన తీరు ఆకట్టుకుంటుంది.
హత్య జరిగిన తీరు .. దారితీసిన పరిస్థితులు .. అందుకు సంబంధించిన ఆధారాలను అజీబ్ సేకరించిన విధానం ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. హీరో ఈ కేసును పర్సనల్ గా తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది. అందుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా, నెక్స్ట్ ఏం జరుగనుందా? అనే ఒక ఆత్రుతను కలిగిస్తూ వెళుతుంది.
యథార్థ సంఘటన కావడం వలన, సహజత్వం దెబ్బతినకుండా చూసుకోవడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు. ప్రతి పాత్రను మలిచిన తీరు .. ప్రతి సన్నివేశాన్ని ఆవిష్కరించిన విధానం గొప్పగా అనిపిస్తాయి. అటు క్రైమ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ గానీ .. ఇటు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. అజయ్ డేవిడ్ ఫొటోగ్రఫీ .. మణికందన్ అయ్యప్ప నేపథ్య సంగీతం .. రంజన్ అబ్రహం ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి.
కథ.. కథనం .. పాత్రలను నడిపించిన విధానం .. లొకేషన్స్ ఈ సినిమాను మరింత బలంగా మారుస్తాయి. ముఖ్యంగా అనవసరమైన హడావిడి .. హంగామా లేకుండా, సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లిన తీరు మెప్పిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ను ఇష్టపడేవారిని ఈ సినిమా థ్రిల్ చేస్తుందని చెప్పచ్చు.
'ఉయిర్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Uyir Review
Movie Details
Movie Name: Uyir
Release Date: 2026-08-04
Cast: Roshan Mathew,Baiju Santhosh,Shruthy Menon,Vineeth Thattil David,Saiyami Kher
Director: M Padmakumar
Music: Manikandan Ayyappa
Banner: Vow Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer